Jammu Kashmir: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇద్దరు భారత సైనికులు కొట్టుకుపోయారు. సైనికులు సూరంకోట్ ప్రాంతంలోని డోగ్రా నల్లాను దాటుతుండగా శనివారం బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారని భారత సైన్యం తెలిపింది.
Read Also: Indore: ఇండోర్‌లో గిరిజన యువకుల బందీ, దాడి కేసులో ముగ్గురు అరెస్టు… ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
శనివారం రాత్రి నాయబ్ సుబేదార్ కులదీప్ సింగ్ మృతదేహాన్ని ప్రవాహం నుండి బయటకు తీయగా, ఈ రోజు సిపాయి తేలు రామ్ మృతదేహాన్ని వెలికితీశారు. పూంచ్ లోని క్లిష్టమైన భూభాగంలో డామినేషన్ పెట్రోలింగ్ సమయంలో నదిని దాటుతున్నప్పుడు ఆకస్మిక వరద్దలో కొట్టుకుపోయిన ఎన్‌బి సబ్ కుల్దీప్ సింగ్ త్యాగానికి 16 కార్ప్స్ నివాళులు అర్పించింది. జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కథువా, సాంబా, జమ్మూ ప్రాంతంలోని ఇతర దిగువ పరివాహక ప్రాంతాలకు ముప్పు ఉందని, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని 24 గంటలు ప్రజలంతా అప్రమత్తమై ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.