Vaarasudu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు టాలీవుడ్‌లోనూ క్రమంగా మార్కెట్ పెరుగుతోంది. అతడి గత చిత్రాలు ఈ విషయం నిరూపించాయి. ముఖ్యంగా మాస్టర్ మూవీ విజయ్ కెరీర్‌లో తెలుగులోనూ బెస్ట్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు వారసుడు మూవీతో మరోసారి విజయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు భాషల్లో ఈనెల 12న విడుదల కానుంది. ఈ సాయంత్రమే ఈ సినిమా తమిళ ట్రైలర్ విడుదల కాగా తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై ఈ మూవీని దిల్ రాజు, ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు.
Read Also: VeerasimhaReddy: వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు.. కారణం ఏంటంటే..?
వారసుడు మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ, సుమన్, శరత్ కుమార్, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్‌లో ప్రకాష్ రాజ్ విలన్‌గా కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడికి, విజయ్‌కు మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గ్రౌండ్‌లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా ఆడియన్స్ చూసేది ఒక్కరినే అని.. అది నాయకుడినే అని విజయ్ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో పాటలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందిందని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. మరి సంక్రాంతి బరిలో వారసుడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో వేచి చూడాల్సిందే.