Vijay Antony: ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని పదేళ్ళ క్రితం ‘నకిలీ’ మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘సలీమ్’ సినిమా చేశాడు. ఈ రెండు చిత్రాలు కాస్తంత ఆలస్యంగా తెలుగులో డబ్ అయ్యి ఫర్వాలేదనిపించాయి. అయితే 2016 మే నెలలో వచ్చిన ‘బిచ్చగాడు’ మాత్రం ఓవర్ నైట్ విజయ్ ఆంటోనికి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. తమిళంలో ‘పిచ్చైకారన్’గా మార్చి 4న విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో చదలవాడ శ్రీనివాసరావు దానిని ‘బిచ్చగాడు’గా తెలుగులో డబ్ చేసి మే 13న రిలీజ్ చేశారు. ఆ సినిమా తమిళంలో కంటే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుండి విజయ్ ఆంటోని నటించిన దాదాపు ఆరేడు సినిమాలు తమిళంతో పాటే తెలుగులోనూ సేమ్ డే రిలీజ్ అయ్యాయి.
చిత్రం ఏమంటే… విజయ్ ఆంటోని నటించిన ‘బేతాళుడు, యమన్, ఇంద్రసేన, కాశీ, రోషగాడు’ వంటి సినిమాలు కరోనాకు ముందు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ప్రచారంతో వచ్చాయి. కానీ ఇవేవీ ‘బిచ్చగాడు’ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ సినిమాలన్నింటిలోనూ ఒక్క ‘కాశీ’ సినిమా మాత్రమే మే నెలలో విడుదలైంది. ఇక కరోనా తర్వాత విజయ్ ఆంటోని నటించిన ‘విజయ్ రాఘవన్’ 2021 సెప్టెంబర్ 17న జనం ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే… ఇంతకాలం తర్వాత మళ్ళీ విజయ్ ఆంటోని సినిమా ఒకటి తిరిగి ‘బిచ్చగాడు’ విజయాన్ని గుర్తు చేస్తూ… అతనిలో విజయోత్సాహాన్ని కలిగిచింది. అదే ‘బిచ్చగాడు-2’. తొలి చిత్రం మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కగా, ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కు విజయ్ ఆంటోని ప్రాధాన్యమిచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి మరో విశేషమూ ఉంది. ‘బిచ్చగాడు’ విడుదలైన ‘మే’ నెలలోనే ఈ సినిమా తెలుగులోనూ రిలీజైంది. దాంతో మే నెల విజయ్ ఆంటోనికి బాగా కలిసొచ్చిందనిపిస్తోంది. ‘బిచ్చగాడు -2’ కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన విజయ్ ఆంటోని దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని స్పష్టం చేశాడు. 2025లో ‘బిచ్చగాడు -3’ విడుదల చేస్తామని తెలిపాడు. నటనతో పాటు నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్, మ్యూజిక్, రైటింగ్… ఇలా పలు డిపార్ట్ మెంట్స్ ను విజయ్ ఆంటోని సింగిల్ హ్యాండ్ తో నిర్వహించడం విశేషం. ‘బిచ్చగాడు-2’ సినిమా విడుదలైన తొలి రోజున డివైడ్ టాక్ ను సంపాదించుకున్నా… ఇప్పుడు కలెక్షన్స్ స్టడీగా ఉండి నిదానంగా పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.