Venu Thottempudi Got Crazy Offer: దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. మరి.. ఆ తర్వాత సంగతేంటి? కంటిన్యూగా ఇండస్ట్రీలో కొనసాగుతాడా? లేకపోతే బ్రేక్ ఇచ్చేస్తాడా? ఈ ప్రశ్నలకు వేణు అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. ఇకపై తాను సినిమాలు చేయనని, రాజకీయాల్లోకి వెళ్లిపోతానని చెప్పాడు. మరి, ఆయన రాజకీయ అరంగేట్రం ఎప్పుడు ఉంటుందో ఏమో తెలీదు కానీ, ఈలోపు ఇండస్ట్రీ మాత్రం ఆయన్ను వదిలిపెట్టేలా లేదు. తమ సినిమాల్లోని ప్రత్యేక పాత్రల కోసం, వేణుకి ఫిలిం మేకర్స్ సంప్రదిస్తున్నారట!
లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. వేణుకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట! మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతోన్న SSMB28 (వర్కింగ్ టైటిల్)లో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట! మరి, ఇది నిజమో కాదో తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే, వేణు ఈ చిత్రంలో నటిస్తే మాత్రం.. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా పుంజుకునే అవకాశాలున్నాయి. జగపతి బాబు తరహాలోనే బిజియెస్ట్ యాక్టర్‌గా అవతరించవచ్చు. కాగా.. వేణు-త్రివిక్రమ్‌లు స్వయంవరం చిత్రంతో ఒకేసారి వెండితెర పరిచయం ఇచ్చారు. ఆ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ఆ తర్వాత వేణు నటించిన ‘చిరునవ్వుతో’ చిత్రానికి కూడా త్రివిక్రమే మాటలు రాశారు.