టేకాఫ్ లో కాసింత తడబాటు, ఆ పై ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా మాటలతో తిరుగుబాటు- ఇలా ఇప్పటికి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగు ఎపిసోడ్స్ కానిచ్చేశారు. వాటన్నిటి కంటే భిన్నంగా సాగింది ఐదవ ఎపిసోడ్. ఇందులో దర్శకధీర రాజమౌళి గెస్ట్ గా రావడం, ఆయనకు తగ్గ ప్రశ్నలతో బాలయ్య సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే, ఈ ఎపిసోడ్ గంట పాటు ఉండడం!
కుటుంబం విలువలు చెబుతూ, ఈ ఐదో ఎసిసోడ్ ఆరంభమయింది. తనకు రెండు కుటుంబాలు ఉన్నాయని హోస్ట్ బాలకృష్ణ చెప్పారు. ఒకటి తన నందమూరి కుటుంబం, రెండోది తనతో పనిచేసే కుటుంబం. కానీ, అతిథిగా వచ్చేవారు మాత్రం సెట్ లోనే తన కుటుంబాన్ని పెట్టుకుంటారని చమత్కరించారు. జక్కన్నా అంటూ బాలయ్య నోట మాట రాగానే, అక్కడ ఉన్న జనం కేరింతలతో ప్రాంగణం మారుమోగింది. ‘రాజమౌళి’ అంటూ బాలకృష్ణ పిలవగానే, ఆ శబ్దం మిన్ను విరిగి మీన పడిందా అన్న రీతిలో సాగింది.
ఆకట్టుకున్న గడ్డం సంగతులు!
హోస్ట్ బాలకృష్ణ, రాజమౌళి రాగానే “రా రా శిఖిపించమౌళి…” అంటూ రాజమౌళిని ఆహ్వానించడం అలరించింది. రాజమౌళి తన సీట్ లో కూర్చోగానే, ఆయన గడ్డంపైనే చర్చ మొదలెట్టారు బాలయ్య. జనం పెదాలపై నవ్వులు నాట్యం చేసేలా ప్రశ్నలు సంధించడం, అందుకు రాజమౌళి సైతం నవ్వుతూనే సమాధానాలు చెప్పడం చూపరులను ఆకట్టుకుంది. ‘మీ కెరీర్ లో అన్నీ విజయాలే…మరి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి” అంటూ బాలకృష్ణ అడిగారు. అందుకు రాజమౌళి నవ్వుతూ “బేసిగ్గా నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. ఎక్కడైనా ఒదిగి ఉండడం అలవాటు. అది అమ్మ చెప్పిన ఇది, నాన్న పెంచిన విధానం కారణం” అని సమాధానమిచ్చారు.
బాలయ్యంటే భయమా!
“ఇప్పటి వరకు మన కాంబినేషన్ పడలేదు. మా అభిమానులు అడిగారంట. మీరు నన్ను హ్యాండిల్ చేయలేమన్నారంట”అన్నది బాలకృష్ణ ప్రశ్న. దానికి “కారణం ఒకటి భయం. భయమంటే మీరేదో చేస్తారని కాదండి. నాకు సినిమా తప్ప హీరో ఏం చేస్తున్నాడు, ఎవరేమి చేస్తున్నారు అన్నది గమనించను…” అని రాజమౌళి చెబుతూ ఉండగానే బాలయ్య మధ్యలో “మన బోయపాటే…” అనగానే నవ్వులు విరిశాయి. “ఇలా చేస్తూ మిమ్మల్ని డైరెక్షన్ చేయలేమోననే టెన్షన్ తోనే చేయలేకపోతాను అనుకున్నానండి” అంటూ అసలు విషయం చెప్పారు రాజమౌళి.
బాలయ్య కాక్ టెయిల్!
తరువాత, రాజమౌళి “నేను మిమ్మల్ని ఒకటడుగుతా…” అనగానే, బాలయ్య సరే అడగండి అనడం, అందుకు రాజమౌళి “మీకు రెండు ఇమేజ్ లు ఉన్నాయి. ఒకటి మీకు కోపమొస్తే ఆగరు. ఎదుటి మనిషి ఎంతవారనీ చూడరు. చేయికి చిక్కినంతగా కొడతారు”, “ఇక రెండో ఇమేజ్ మీ దగ్గరకు గెస్ట్ లు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైనా వస్తే మీ కంటే చిన్నవారయినా లేచి నిలబడి గౌరవిస్తారు. సీనియర్లను పేరు పేరునా గుర్తు పెట్టుకొని గౌరవమిస్తారు. మీరు చేసే సేవ దగ్గర దగ్గర దేవుడు స్థానంలో నించో పెట్టింది” అని రాజమౌళి చెప్పగానే జనం ఉత్సాహంగా కేకలు వేశారు. ఈ రెండు ఇమేజెస్ లో ఏది నిజమని రాజమౌళి అడిగారు. అందుకు బాలకృష్ణ “బాలయ్య కాక్ టెయిల్…” అని సమాధానం ఇవ్వగానే నవ్వులే నవ్వులు. అదే సమయంలో రాజమౌళి కూడా తమ బసవతారకం ఆసుపత్రికి అండగా ఉన్నారని, అయితే పేరు బయటకు రానీయ వద్దని చెప్పారు అంటూ అసలు విషయం బయట పెట్టారు బాలకృష్ణ.
ఇమేజ్ గ్రాఫ్!
‘సమ్రాట్ అశోక్’ టైమ్ లో స్క్రిప్ట్ నేలకేసి కొట్టడం గురించి బాలయ్య చెప్పడం, దానికి “మీరు చేసింది తప్పు” అంటూ రాజమౌళి చెప్పడం జరిగాయి. అదే సమయంలో యన్టీఆర్ డైరెక్షన్ గురించి రాజమౌళి ‘దానవీరశూర కర్ణ’లోని కర్ణుని ఇంట్రో సీన్ వివరించడం అందరినీ ఆకట్టుకుంది. ఆలస్యంగా చిత్రాలు తీయడానికి కారణమేంటని బాలకృష్ణ అడిగినప్పుడు, రాజమౌళి “భయం” అని సమాధానమిచ్చారు. అందుకు తగ్గ వివరణనూ తెలిపారు. అదే సమయంలో ఓ ప్రశ్నకు “భయానికి, బాలయ్యకు సంబంధం లేదు” అని రాజమౌళి అనడం ఆకట్టుకుంది. సంభాషణల్లో ముందుకు సాగుతూ, “అవతార్… నాకు నచ్చలేదండి… మీరేమంటారు? ” అని బాలయ్య అడగ్గానే, “అమ్మో..” అన్నారు రాజమౌళి. బాలకృష్ణ క్రేజ్ ఎలా మలుపులు తిరిగి, ఇప్పుడు యువత సైతం “జై బాలయ్యా…” అంటూ కేకలు వేయిస్తోందని రాజమౌళి చెప్పడం అలరించింది. చిన్నప్పటి నుంచీ ‘బెన్ హర్’ లాంటి పెద్ద సినిమా తీస్తాననే నమ్మకం తనకుండేదని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అక్కడా… జై బాలయ్యే!
మధ్యలో రాజమౌళి అన్న, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి కూడా జాయిన్ అయ్యారు. ఆయన ‘గ్రావిటీ’ సినిమా చూస్తూండగా “జై బాలయ్యా…” అంటూ మావాడు పక్కనే అరవగానే, మేమంతా ఎంతో హాయిగా ఎంజాయ్ చేశామని కీరవాణి చెప్పడం మురిపించింది. ఓ ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి, “రమదే పైచేయి…” అని చెప్పి నవ్వులు పూయించారు. తన పెద్దన్న కీరవాణి కంటే ఎవరైనా బెటర్ గా ట్యూన్స్ ఇస్తే, ఆయనను వదలి వెళ్తాననీ చెప్పారు రాజమౌళి. ‘అల్టిమేట్ గా సినిమానే ఎక్కువని, సినిమా కంటే ఎవరూ ఎక్కువ కాదని’ తెలిపారు. తన సినిమాలకు పెద్దన్న న్యాయం చేయగలరనే ఆయనతోనే సాగుతున్నాననీ వివరించారు.
జై రాజమౌళి…
ఇక బాలకృష్ణ అన్నదమ్ములు కీరవాణి, రాజమౌళిని వారి కుటుంబం గురించి అడిగిన ప్రశ్నలు భలే సరదాగా సాగాయి. చూసిన వారికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాయి. ఇదే సమయంలో రాజమౌళి తన చిన్ననాటి జ్ఞాపకాలను ముచ్చటించడమూ అలరించింది. ఇక ఇదే వేదికపై కీరవాణి తాను స్వరపరచిన ‘మేజర్ చంద్రకాంత్’లోని “జోహార్…జోహార్… సుభాష్ చంద్రబోస్…” పాట పాడి ఆకట్టుకున్నారు. కథ చెప్పడంపై సరదాగా సాగిన ఆట భలేగా వినోదం పండించింది. చివరకు బాలయ్యనే కథ చెప్పి ముగించడం మరింత వినోదం పంచింది. “నెక్ట్స్ రాజమౌళి సినిమాకు కథ నేనే ఇస్తా…” అని బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది. “మీ బిగ్గెస్ట్ వెపన్ .. మీ స్మైల్” అంటూ రాజమౌళికి కితాబు నిచ్చారు బాలకృష్ణ.. చివరలో కప్స్ పై ‘జై బాలయ్యా…’ అంటూ సైన్ చేశారు అన్నదమ్ములు. వారికి “జై రాజమౌళి… జై కీరవాణి…” అంటూ బాలయ్య స్లోగన్స్ ఇవ్వడం మరింతగా మురిపించింది.
మునుపటి ఎపిసోడ్స్ తో పోలిస్తే ఈ అయిదవ ఎపిసోడ్ అంత సరదాగా మరొకటి సాగలేదనే చెప్పాలి. ఏది ఏమైనా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ షో, మునుముందు మరింతగా వినోదం పంచుతుందనే అనిపిస్తోంది.