నా కథ కాపీ కొట్టారు.. మిరాయ్’కి షాక్?
టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తాను రచించిన ‘ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్’ పుస్తకాన్ని కాపీ చేసి సినిమా తీశారని ఆరోపించారు. మిరాయ్ మేకర్స్ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు.పిటిషనర్ గిరిధర్ తన పుస్తకంలోని కథాంశం, పాత్రలు, సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని వాదిస్తున్నారు. దీంతో సినిమా డైరెక్టర్, నిర్మాతతో పాటు ఇతర సంబంధిత వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై రేపు (సోమవారం) విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే అని వెల్లడించారు. తొలిసారి అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం ప్రారంభించామని అన్నారు. ఉపాధి లేక పాలమూరు జిల్లా నుంచి వలసలు వెళ్లేవారు అని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శ్రీశైలం జలాలు అందించామని తెలిపారు. నల్గొండకు లిఫ్ట్ ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ నీళ్లిచ్చామన్నారు. నదుల అనుసంధానంతో సాగుకు ఊతమని వాజ్‌పేయీకి సూచించానని తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ గాయాలు.. టీం కీలక ప్రకటన
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా సీరియస్ గాయాలు ఏమీ కాదని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఒక అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఇంజురీ జరిగిందని చెప్పుకొచ్చారు.
ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ పూర్తి.. మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపాలని సిట్ నిర్ణయం
లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. 4 గంటలపాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం GGH కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. మిథున్ రెడ్డిని పలు విషయాలపై సిట్ ప్రశ్నించింది. లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలోకి వెళ్ళటంపై ప్రశ్నించింది. ఐదేళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల గురించి విచారణలో ప్రస్తావించింది. ఎన్నికల అఫిడవిట్ లోనే ఆస్తుల వివరాలు ఉంచినట్టు విచారణలో తెలిపాడు మిథున్ రెడ్డి. ఫోన్ గురించి ఆరా తీశారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనేక ప్రశ్నలకు మిథున్ రెడ్డి సహకరించేలేదన్న భావనలో సెట్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్ కుటుంబంలో సమస్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్ల (కవిత)పై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వారి కుటుంబ సమస్య అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “నేను ఎక్కడా కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఇది వారి ఇంటి సమస్య. ఆస్తి తగాదాల వల్ల వారి కుటుంబ సమస్యలు బజారున పడ్డాయి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించారు. ఆ నలుగురిని తెలంగాణ ప్రజలు బహిష్కరించారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దాం..
వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లలేదని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరు అని వైఎస్ జగన్ మండిపడ్డారు. నేను అసెంబ్లీకి వెళ్లవద్దని ఎవరికీ చెప్పలేదన్నారు. వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు.
పాపం ట్రంప్.. అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేక స్వరం
అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే.. మనోడి తీరు అమెరికన్లకు కూడా నచ్చడం లేదంటా. ఇది నిజం అండీ బాబు అమెరికన్లు తమ అధ్యక్షుడిని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది. 242 రోజుల పాలన తర్వాత ట్రంప్ రేటింగ్ -17 శాతానికి పడిపోయింది. ఇంతకీ అమెరికా అధ్యక్షుడిని వాళ్ల జనాలే వ్యతిరేకించడానికి కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.. పలువురు విశ్లేషకుల అభిప్రాయంలో.. ట్రంప్ రేటింగ్ తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. వాటిలో ఆయన తీసుకున్న సుంకాల విధానాలు, విదేశాంగ విధానం, కఠినమైన వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ కోతలు, విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం వంటివి తాజాగా నిర్వహించిన సర్వేలో ఆయన రేటింగ్ పడిపోడానికి కారణం అయ్యాయని చెబుతున్నారు. ది ఎకనామిస్ట్ నివేదిక ప్రకారం.. ట్రంప్ ప్రజాదరణ గత వారంతో పోలిస్తే 2.6 పాయింట్లు తగ్గింది. తాజా డేటా ప్రకారం.. ట్రంప్ పని శైలిని 39% మంది మాత్రమే ఆమోదిస్తున్నారు. 56% మంది ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొంది.
ఏపీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన రూ. 4000 కోట్ల లిక్కర్ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ భారీ దాడులు నిర్వహించింది. పీఎంఎల్‌ఏ చట్టం, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ఆంధ్రప్రదేశ్‌లోని 20 ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. ఏపీ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి మధ్య అమలు చేసిన కొత్త లిక్కర్ పాలసీ కిందే భారీ మోసాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాపులర్ బ్రాండ్లు (McDowell’s, Royal Stag, Imperial Blue వంటి) కిక్‌బ్యాక్‌లు ఇవ్వడానికి నిరాకరించగా, వాటిని పక్కనబెట్టి కొత్త / నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ను తొలగించి మాన్యువల్ ఆర్డర్ సిస్టమ్‌కి మారడం ద్వారా సప్లై వాల్యూమ్‌లో భారీ మోసాలు జరిగాయి.
అంచనాలు లేనివేళ ఖర్చు లెక్కలు ఎలా..? హరీష్ రావు గణితం కొత్త మ్యాజిక్.!
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతుందని, 4.47 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుందని హరీష్ రావు చేసిన ప్రకటన అసత్యమని ఆయన స్పష్టం చేశారు. “తుమ్మడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో హరీష్ రావు అంచనాలు ఎలా చెబుతారు? ఇది ఆయన అతితెలివి తేటలకు అద్దం పడుతున్నట్లే” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ ఇక ‘నో-ఫ్లై జోన్’
తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఇకపై ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం పైన లేదా దాని చుట్టుపక్కల డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా నిర్మించిన సచివాలయం రాష్ట్ర పరిపాలనా కేంద్రం కావడం, ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచుగా ఉండే కారణంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం భద్రతకు డ్రోన్‌ల ద్వారా ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు నివేదించాయి. ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు డ్రోన్లను ఉపయోగించి సచివాలయంపై నిఘా పెట్టడం లేదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని నివేదికలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.