ఆన్ లైన్ లో రిలీజ్ కి ముందే రోజే టికెట్ బుక్ చేసుకోని థియేటర్స్ వెళ్లే ఆడియన్స్ ఉన్న రోజులు ఇవి. టికెట్స్ కోసం పెద్దగా కష్టపడకుండా బుక్ మై షో, పేటీయమ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో బుక్ చేసుకోని సినిమా చూసే వాళ్లకి ఫస్ట్ రోజు మొదటి షోకి టికెట్ కోసం థియేటర్ దగ్గర క్యు నిలబడి టికెట్ తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలియదు. మాములు హీరోకే మొదటి రోజు మొదటి షోకి థియేటర్స్ దగ్గర క్యులో నిలబడి టికెట్స్ తెచ్చుకోవడం కష్టం అంటే ఇక ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి సినిమాకి టికెట్ సంపాదించడం ఇంకెంత కష్టమో ఊహించుకోవచ్చు. ఈరోజు ఆన్ లైన్ బుకింగ్స్ చేసుకుంటున్న వాళ్లని కాదు ఆ రోజు థియేటర్స్ దగ్గర టికెట్స్ కోసం కష్టాలు పడిన వాళ్లని అడిగితే తెలుస్తుంది మెగాస్టార్ రేంజ్ ఏంటో. టికెట్స్ కోసం వెళ్తే కౌంటర్ల దగ్గర చిరిగిన చొక్కాలు, ఊడి పడిన గుండీలు చెప్తాయి మెగాస్టార్ రేంజ్ ఏంటో. ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అని రెండు దశాబ్దాల క్రితమే ఆర్టికల్ రాసిన వాళ్లకి మెగాస్టార్ స్థానం ఏంటో, ఆయన స్థాయి ఏంటో.
ఇలాంటి విషయాలు మరిచిపోయిన కొందరు, చిరంజీవి మూడు సినిమాలతో నిరాశ పరచగానే ఆయన్ని విమర్శలు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ విమర్శలని పాతాళంలో పడుకో పెడుతూ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నాన్-స్టార్ డైరెక్టర్ బాబీ రూపిందించిన ఒక యావరేజ్ సినిమాకే చిరంజీవి రాబడుతున్న కలెక్షన్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అయిదు రోజుల్లో 120 కోట్ల గ్రాస్ ని రాబట్టిన చిరు, ఓవర్సీస్ లో అయితే సునామీ సృష్టిస్తున్నాడు. వారం కూడా తిరగకుండానే 1.9 మిలియన్ డాలర్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యాడు.
వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు రిలీజ్ అయిన వీర సింహా రెడ్డి, వారిసు, తునివు సినిమాలు మిలియన్ మార్క్ రీచ్ అయ్యాయి కానీ చిరు అక్కడ డబుల్ మార్జిన్ తో జెండా ఎగరేస్తున్నాడు. సముద్రాలు అవుతల వీస్తున్న చిరు గాలి, అతి తక్కువ సమయంలో 2 మిలియన్ మార్క్ రీచ్ అయ్యి ఓవరాల్ రన్ లో 2.8 మిలియన్ డాలర్స్ రాబట్టే వరకూ వెళ్లనుంది. ఈ కలెక్షన్స్ చూసిన తర్వాత అయినా చిరు పని అయిపొయింది అనే మాటకి చిరస్థాయిగా ముగింపు పడితే బాగుంటుంది.