ఈ రోజుల్లో ఆ యా సినిమాల్లో నటించిన హీరోయిన్లు తమ సినిమా ఆడియో వేడుకలో పాల్గొనటానికి అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఓ తమిళ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ లో 10 మంది హీరోయిన్లు సందడి చేయట విశేషంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు శరవణ.

లెజెండ్ శరవణన్ అనే ఇతగాడు తమిళనాడులో బడ్డింగ్ హీరో. అయితే ఇతగాడు పెద్ద బిజినెస్ మేన్. శరవణ స్టోర్స్ అధినేత అయిన ఇతగాడికి నటన అంటే మక్కువ. అందుకే తమ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ లో హీరోయిన్లతో కలసి ఇతగాడే నటిస్తుంటాడు. అలా హన్సికతో కలిసి ‘లెజెండ్ శరవణ’ స్టోర్స్ ప్రకటనలో కనిపించిన శరవణన్ అరుల్ బాగా ట్రోల్ కి కూడా గురయ్యాడు.

ఇతడు ఇప్పుడు ‘ది లెజెండ్’ అనే పేరుతో సినిమా చేస్తున్నాడు. ఇందులో లక్ష్మీ రాయ్ హీరోయిన్. ఇక ఇందులో ఓ పాట బాగా వైరల్ అయ్యింది. ప్రభు, నాజర్, విజయ్ కుమార్, లత, కోవైసరళ, యోగిబాబు ఇందులో ఇతర తారాగణం. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగింది. దీనికి పది మంది హీరోయిన్లు హాజరవటం విశేషం. పూజా హెగ్డే, తమన్నా, ఊర్వశి రౌటేలా, హన్సిక, శ్రీలీల, లక్ష్మీ రాయ్, శ్రద్ధా శ్రీనాథ్, డింపుల్ హయతి, యాషికా ఆనంద్, నూపూర్ సనన్ వంటి వారు హాజరయ్యారు.

అయితే నిర్మాత కూడా అయిన శరవణన్ ప్రతి హీరోయిన్‌కి చార్టర్డ్ ఫ్లైట్ టిక్కెట్ తో పాటు పారితోషికం కూడా ఇచ్చి తీసుకు వచ్చాడట. టాప్ హీరోలు కూడా చేయలేని ప్రమోషన్ ఇది. శరవణన్ డబ్బును నీళ్లలా కుమ్మరించడంతో సాధ్యపడిందన్నమాట. మరి ఈ ప్రచారం సినిమాకు ఎంత వరకూ ఉపయోగపడుతుందన్నది జులైలో కానీ తెలియదు. ఎందుకంటే ఆ నెలలోనే సినిమా రిలీజ్.