Teja Sajja: హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న రెండో సినిమా ‘హను – మాన్’. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ‘హను -మాన్’ టీజర్ సోమవారం విడుదలైంది. అతి కొద్ది సేపట్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. టీజర్ ప్రారంభం నుండి ముగింపు వరకూ గ్రాఫిక్ వండర్ తో గూస్ బంప్స్ వచ్చేలా ఇది సాగింది. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అ’ తోనే బెస్ట్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా సైతం చక్కని విజయాన్ని అందుకుంది. ఇక స్టార్స్ తో సంబంధం లేకుండా కథతోనే తాను వండర్స్ సృష్టించగలనని ‘జాంబీరెడ్డి’తో మరోసారి నిరూపించుకున్నాడు. ఆ చిత్రానికి లభించిన విజయంతో పూర్తి విశ్వాసంతో తేజా సజ్జతోనే ‘హను – మాన్’ మొదలెట్టాడు. అమృత అయ్యర్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమైందని ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఇండియన్ సూపర్ హీరోగా తేజ సజ్జా హనుమంతుడికి ఉన్న శక్తులతో ఆకట్టుకున్నాడు. వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో గెటప్ శ్రీను, సత్య ఇతర ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.
టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్‌లను అందిస్తున్నారు. వారి పనితనం ఈ టీజర్ తో స్పష్టమైంది. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘హను -మాన్’తో ప్రశాంత్ వర్మ మరోసారి దేశవ్యాప్తంగా తన సత్తా చాటడం ఖాయమని ఈ టీజర్ చూస్తుంటే అర్థమైపోతోంది.