సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన తలైవా పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ లో కూడా పాల్గొనడం, ఇటీవలే ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ఫిల్మ్ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో రజినీ హాస్పిటల్ లో చేరారన్న విషయంతో అభిమానులలో ఆందోళన మొదలయ్యింది.
ఇక రజినీ చెన్నై హాస్పిటల్ లో చేరినట్లు ఆయన సతీమణి లతా కూడా కన్ఫర్మ్ చేయడంతో మళ్లీ రజినీకి ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయన జనరల్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లారని, నార్మల్ టెస్ట్ లు మాత్రం చేస్తున్నారని, అందుకే రజినీ హాస్పిటల్ లో ఉండాల్సివచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రజినీ సన్నిహితులు తెలుపుతున్నారు. ఏదిఏమైనా రజినీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం తలైవా ‘అన్నాతే’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదల కానుంది.