యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈ సినిమాకు సూపర్ పార్ట్ నర్ లభించారు. తమిళనాట ‘రాధేశ్యామ్’ మూవీతో ఉదయనిథి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ కొలాబరేట్ కాబోతోంది. ఈ మూవీ తమిళ వర్షన్ కు ఈ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 3న వెలువడింది. సరిగ్గా ‘రాధేశ్యామ్’ అధికారిక విడుదల తేదీ ప్రకటన వచ్చిన ఒక్క రోజులోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీ నిర్మాతలతో ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం.
వరల్డ్ ఫేమస్ పామిస్ట్ విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో డాక్టర్ ప్రేరణ పాత్రను పూజా హెగ్డే చేస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. జస్టిన్ ప్రభాకర్ స్వరాలు సమకూర్చిన ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందించారు. మార్చి 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.