యావద్భారతంలోనూ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా విశేషంగా వీస్తోంది. దాంతో దక్షిణాది తారలు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. దక్షిణాది తారల విశేషాలను సైతం ఉత్తరాది వారు ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండడం గమనార్హం! ఈ పరిశీలనలో దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాలు అగ్రపథంలో సాగుతున్నా, కన్నడ చిత్రసీమలోనే ‘సినీ’సంబంధాలు అధికంగా ఉన్నట్టు ఓ పరిశీలనలో తేటతెల్లమయింది. ప్రస్తుతం కన్నడనాట టాప్ స్టార్ గా సాగుతున్న ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ ఒకప్పటి సినిమా హీరోయిన్. ఈ తరంలోనే కాదు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నాటి నుంచీ అక్కడి స్టార్స్ సతీమణులకు చిత్రసీమలో ఏదో ఒక అనుబంధం ఉందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లోని టాప్ స్టార్స్ సతీమణుల్లో అధికులు గృహిణులే కావడం ఇక్కడ గమనించదగ్గ అంశం.
మహానటుడు రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ పలు చిత్రాలకు నిర్మాతగానూ, పంపిణీదారుగానూ వ్యవహరించారు. ఆమె కన్నడలో నిర్మించి, విడుదల చేసిన అనేక చిత్రాలు ఘనవిజయం సాధించాయి. రాజ్ కుమార్ తరానికి చెందిన మరో ప్రముఖ కన్నడ హీరో కళ్యాణ్ కుమార్ భార్య రేవతి సినిమా నటి. ఆ తరువాత తరం స్టార్ హీరో విష్ణువర్ధన్ భార్య ప్రముఖ నటి భారతి. ఈమె అనేక తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించారు. తరువాతి రోజుల్లో నిర్మాతగానూ కొన్ని సినిమాలు నిర్మించారు. ఇక మరో స్టార్ హీరో అంబరీశ్ తెలుగు నటి సుమలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంబరీశ్ రాజకీయాల్లోనూ రాణించగా, ఆయన భార్య సుమలత సైతం ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాలలో యాక్షన్ హీరో అనిపించుకున్న అర్జున్ సర్జూ కూడా నటి నివేదితను పెళ్ళాడారు. ఈమె కొన్ని తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలలో నాయికగా నటించారు. తెలుగువారి అభిమానం చూరగొన్న మరో హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా నటి. ఆమె కూడా తమిళ, తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా అభినయించారు.
పలు తెలుగు చిత్రాలలో విలన్ గా నటించిన కన్నడ ప్రభాకర్ మూడు పెళ్ళిళ్లు చేసుకోగా వారిలో ఒకరు ప్రముఖ కన్నడ నటి జయమాల, మరో భార్య అంజు కూడా తమిళ, మళయాళ భాషల్లో నటిగా రాణించారు.
ఈ స్టార్స్ భార్యల్లో చాలామంది వివాహానంతరం సైతం భర్తల విజయపరంపరలో ఏదో విధంగా పాలు పంచుకోవడం విశేషం! ప్రస్తుతం కన్నడ నాట టాప్ స్టార్ గా సాగుతోన్న యశ్ కెరీర్ సక్సెస్ రూటు నుండి గ్రాండ్ సక్సెస్ వేలో సాగడానికి ఆయన భార్య రాధికా పండిట్ తీసుకొనే జాగ్రత్తలే కారణమని వినిపిస్తోంది. యశ్ నటించిన తాజా చిత్రం ‘కేజీఎఫ్-2’ కూడా సక్సెస్ రూటులో సాగుతోంది. అందువల్లే ఉత్తరాదివారు కన్నడ సీమపై దృష్టి సారించి, అక్కడి స్టార్స్ సతీమణుల వివరాలూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.