‘మహానటి’తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామం అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చింది. ఎవరూ లేని రామ్ అనే ఓ ఒంటరి సైనికుడు, అతని ప్రేమలో పడే సీత అనే అమ్మాయి చుట్టూ.. ఓ అందమైన ప్రేమకథగా ఈ సినిమా సాగనున్నట్టు టీజర్ ని బట్టి అర్థమవుతోంది. కనులవిందుగా ఉన్న దృశ్యాలు, మనసుల్ని కట్టిపడేసే ఆ డైలాగులు వింటే.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
‘‘ఆకాశవాణి.. లెఫ్టినెంట్ రామ్, నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఓ కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక్క పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’’ అంటూ హీరో గురించి హీరోయిన్ చెప్పే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ‘‘డియర్ రామ్, నీకెవరు లేరా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావయ్యా కొత్తగా’’ అంటూ.. చివర్లో ‘‘ఇట్లు నీ భార్య సీతా మహాలక్ష్మి’’ అని సాగే డైలాగ్ విన్నప్పుడు రొమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. చూస్తుంటే.. ఈసారి హను రాఘవపూడి ఒక గొప్ప ప్రేమకథతో అందరినీ మైమరిపించేలా కనిపిస్తున్నాడు.
1965 బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్, స్వప్న మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.