పాత్ర నచ్చితే చాలు “ఊ…” అనడమే తెలుసు, “ఊహూ…” అని మాత్రం అనరు. అదీ సమంత బాణీ! అందం, చందం, అభినయం అన్నీ కుదిరిన సమంత తనదైన పంథాలో పయనిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా సాగుతున్న సమంత ప్రస్తుతం పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో శకుంతల పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి సమంత సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ‘మహానటి’లో సహాయ పాత్రలోనూ మెప్పించారు. ఇప్పుడు శకుంతలగా అలరించే ప్రయత్నమూ చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న మద్రాసులో జన్మించింది. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజ్ లో డిగ్రీ చదివిన సమంత, అప్పట్లోనే మోడలింగ్ చేయడం మొదలెట్టింది. ఆ సమయంలోనే దర్శకుడు రవి వర్మన్ ఆమెలోని ఛామ్ ను గుర్తించాడు. ఆయన వల్లే సమంత దర్శకుడు గౌతమ్ మీనన్ కు పరిచయం అయింది. అలా ‘ఏ మాయ చేశావే’తో నటిగా మారింది. తమిళనాట పుట్టిన సమంత తెలుగునాట అడుగు పెట్టగానే ‘ఏ మాయ చేశావే’తో నిజంగానే మాయ చేసేశారు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకు ఆ సినిమాతో విజయాన్ని అందించి, విజయనాయిక అయ్యారు. తరువాత వరుసగా నటవారసులతో నటించిన సమంతకు “బృందావనం, దూకుడు” చిత్రాలు మంచి విజయాలనే అందించాయి. ‘ఈగ’లో అభినయంతోనూ ఆకట్టుకున్న సమంతకు తరువాత వచ్చిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ ఉత్తమ నటిగా నంది అవార్డునూ అందించింది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, అ ఆ, రంగస్థలం” చిత్రాలతో తెలుగువారిని మరింతగా ఆకట్టుకున్నారు సమంత.
తెలుగులో తన తొలి చిత్ర కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్ళాడిన సమంత, తరువాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇప్పటికీ నటనలో కొనసాగుతూనే ఉన్నారామె. ప్రస్తుతం ‘కన్మణి రాంబో ఖతియా’, ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలలో నటిస్తున్నారు. ‘పుష్ప’లో “ఊ అంటావా మావా…” అని ఐటమ్ సాంగ్ లో ఉడికించిన సమంత, ‘పుష్ప’ సీక్వెల్ లోనూ ఐటమ్ గాళ్ గానే కనిపించనున్నారు! నటిగా వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతున్న సమంత ప్రేక్షకులను మరింతగా అలరిస్తారని చెప్పవచ్చు.