పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన ‘చోర్ బజార్’ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. దాంతో ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ మహరాజా రవితేజ. ఈ చిత్రంలోని ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ లిరికల్ సాంగ్ ను ఆయన తాజాగా విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే కావడం విశేషం. ఆయన తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్ పేరు మీద చేసిన పాట కాబట్టి రవితేజ సంతోషంగా ఈ పాటను ఆవిష్కరించారు. ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ బాగుందని, ‘చోర్ బజార్’ సినిమా హిట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. మదీన్ ఎస్కే స్వర రచన చేసిన ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ పాటను మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా మంగ్లీ పాడారు.
ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ‘చోర్ బజార్’ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గెహనా సిప్పీ నాయికగా నటించింది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వస్తూ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పకులుగా వ్యవహరించడం చిత్రానికి మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.