యంగ్ టైగర్ యన్టీఆర్ ను తాతకు తగ్గ మనవడుగా నిలిపిన చిత్రాలలో ‘రాఖీ’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ఇందులోని కోర్టు సీన్ లో జూనియర్ యన్టీఆర్ నటన, ‘బొబ్బిలిపులి’లో నటరత్న యన్టీఆర్ ను గుర్తు చేసిందని ఎందరో అన్నారు. సాక్షాత్తు ‘బొబ్బిలిపులి’ చిత్ర నిర్దేశకులు దాసరి నారాయణరావు ‘తాతను గుర్తు చేశాడు తారక్’ అంటూ అభినందించారు. ‘రాఖీ’ టైటిల్ కు తగ్గట్టుగానే కథలో ఎంతోమంది హీరోని అన్నయ్యగా భావించి, అతనికి రాఖీలు కట్టడం భలేగా ఆకట్టుకుంది. 2006 డిసెంబర్ 22న విడుదలైన ‘రాఖీ’ చిత్రం అభిమానులను అలరించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రాఖీ’ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి సమర్పణలో డాక్టర్ కె.ఎల్.నారాయణ తమ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు.
‘రాఖీ’ కథ ఏమిటంటే – రామకృష్ణ తన తండ్రిలాగే రైల్వేలో స్టేషన్ మాస్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. ‘రాఖీ’ అతని ముద్దు పేరు. వారిది ఆనందంగా సాగే సంసారం. వారింటి పక్కనే ఉండే త్రిపురసుందరి అంటే రాఖీకి ఎంతో ఇష్టం. త్రిపుర టీవీ జర్నలిస్ట్ గా అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ వాలిపోయి, ప్రతిఘటిస్తూ ఉంటుంది. రాఖీ మేనత్త కూతురు గౌరికి అతనంటే పిచ్చిప్రేమ. రాఖీకి తన చెల్లెలు గాయత్రి అంటే ప్రాణం. ఆమె అత్తవారింట కట్నదాహానికి బలైపోతుంది. దాంతో రాఖీ, ఆ ఇంట్లోని వారిని అంతమొందించడమే కాదు, ఎక్కడ అమ్మాయిలకు అన్యాయం జరిగితే అక్కడ వాలిపోయి, మృగాల లాంటి మనుషులను ఏరిపారేస్తుంటారు. దాంతో రాఖీని పోలీసులు అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అతణ్ణి అరెస్ట్ చేయడానికి మీనాక్షి అయ్యర్ అనే పోలీస్ ఆఫీసర్ ను నియమిస్తారు. అయితే, ఓ మినిస్టర్ ఆమెను అవమానిస్తాడు. రాఖీ, మీనాక్షికి పట్టుబడి, జైలుకు వెళతాడు. అక్కడ ఓ అమ్మాయిని నాశనం చేసిన వాణ్ణి చంపేస్తాడు. రాఖీని చంపేయాలని మినిస్టర్ జైలు బయట బాంబు పెట్టిస్తాడు. అదే సమయంలో రాఖీ పండగ సందర్భంగా అతనికి రక్షాబంధనం కట్టడానికి ఎంతోమంది అమ్మాయిలు వస్తారు. బాంబు కారణంగా ఆ అమ్మాయిలు చనిపోతారు. అక్కడికి వచ్చిన రాఖీ మరదలు గౌరీ కూడా చనిపోతుంది. రాఖీ తప్పించుకొని, ఆ మినిస్టర్ ను చంపేస్తాడు. పోలీసులకు లొంగిపోతాడు. కోర్టులో హాజరు పరుస్తారు. రాఖీ చేసింది తప్పేమీ కాదని తెలిసినా, చట్టం న్యాయం అడ్డువస్తాయి. జడ్జి సైతం తన పోస్ట్ కు రాజీనామా చేసి, రాఖీ తరపున న్యాయవాదిగా వాదిస్తానంటారు. అమాయకులైన ఆడపిల్లలను ఆదుకొనే అన్నగా రాఖీలాంటి వారు రావాలనే జనం కోరుకుంటూ ఉండగా సినిమా ముగుస్తుంది.
‘రాఖీ’గా జూనియర్ యన్టీఆర్ నటించిన ఈ చిత్రంలో ఇలియానా, ఛార్మి, సుహాసిని, శరత్ బాబు, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజీ, శరణ్య, సునీల్, షయాజీ షిండే, మంజూష, రవి వర్మ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ఉత్తేజ్, సత్యం రాజేశ్, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు. దర్శకుడు కృష్ణవంశీ కథ, స్క్రీన్ ప్లే రాసిన ఈ చిత్రానికి తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాశారు. కోర్టు సీన్ లోని జూనియర్ యన్టీఆర్ పలికిన డైలాగ్స్ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ‘రాఖీ’ సినిమాలో సీతారామశాస్త్రి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ పాటలు పలికించారు. “రంగు రబ్బా రబ్బా…”, “జర జరా…”, “వస్తవా వస్తవా…”, “రాఖీ రాఖీ నా కవ్వాసాకీ…”, “కళ్ళలో కాలాగ్ని…”, “నిన్ను చూస్తే…” వంటి పాటలు అలరించాయి. ఈ సినిమా ఆ రోజుల్లో దాదాపు ఆరువందల థియేటర్లలో విడుదలై అలరించింది. కొన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.