Progress report: NO Hit Movies In July
ఈ యేడాది లో ఇంతవరకూ అత్యధిక చిత్రాలు విడుదలైంది జూలైలోనే. అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా 31 సినిమాలు ఈ నెలలో జనం ముందుకొచ్చాయి. చిత్రం ఏమంటే… ఇందులో ఏ ఒక్కటీ ఘన విజయాన్ని సొంతం చేసుకోలేదు. అసలు జూలై ప్రారంభమే ఉసూరుమంటూ జరిగింది. హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పక్కా కమర్షియల్’ జూలై 1న విడుదలైంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఈ సినిమా పేరుకు తగ్గ విజయాన్ని మాత్రం పొందలేకపోయింది. ‘పక్కా కమర్షియల్’ను అందరూ పక్కా ఫ్లాప్ అనేశారు. అదే వారం శ్రీరామ్, అవికాగోర్ నటించిన ‘టెన్త్ క్లాస్ డైరీస్, షికారు, ఏమై పోతానే, బాల్రాజు, ఈవిల్ లైఫ్’ వంటి స్ట్రయిట్ తెలుగు సినిమాలు, ‘ఏనుగు’, ‘రాకెట్రీ’ వంటి అనువాద చిత్రాలు వచ్చాయి. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథను ఆధారం చేసుకుని ఆర్. మాధవన్ రూపొందించిన ‘రాకెట్రీ’కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా ఈ సినిమా తెలుగువారిని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి… మళ్ళీ జనాలు దీని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు.
జూలై రెండో వారంలో హాలీవుడ్ మూవీ ‘థోర్: లవ్ అండ్ థండర్’, తమిళ అనువాద చిత్రం ‘మాయోన్’ విడుదలయ్యాయి. కాస్తంత ఆలస్యంగా పృథ్వీరాజ్ నటించిన మలయాళ డబ్బింగ్ మూవీ ‘కడువా’ కూడా వచ్చింది. బట్ ఇవేవీ బాక్సాఫీస్ మీద ప్రభావం చూపలేకపోయాయి. ఇక లావణ్య త్రిపాఠి ద్విపాత్రాభినయం చేసిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ రిలీజ్ కు ముందు మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఆ మూవీ డైరెక్టర్ రితేష్ రాణ తొలి చిత్రం ‘మత్తు వదలరా’కు చక్కని స్పందన రావడంతో ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ‘హ్యాపీ బర్త్ డే’ను ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు. అదే వారం సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్ లో రఘు కుంచె నటించిన ‘మా నాన్న నక్సలైట్’, సందీప్ మాధవ్ ‘గంధర్వ’తో పాటు ‘కొండవీడు, రుద్రసింహా’ చిత్రాలు వచ్చాయి. వీటిని జనం అసలు పట్టించుకోలేదు.
జూలై నెలలో వచ్చిన చిత్రాలలో కాస్తంత చెప్పుకోదగ్గది రామ్ నటించిన ద్విభాషా చిత్రం ‘ది వారియర్’. పోలీస్ టర్డ్న్ డాక్టర్ గా రామ్ ఇందులో భిన్నమైన పాత్ర చేశాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి హీరోయిన్ గా నటించడంతో సహజంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ‘ఇస్మార్ట్ శంకర్, రెడ్’ మూవీస్ తర్వాత రామ్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కావడంతో అతని అభిమానులూ ఈ మూవీ మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. కానీ రొటీన్ కథ, కథనాలతో లింగుస్వామి దీన్ని తీసి, అందరినీ నిరుత్సాహానికి గురిచేశారు. అదే వారాంతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘అమ్మాయి – ది డ్రాగన్ గర్ల్’, ప్రభుదేవా ‘మై డియర్ భూతం’, సాయిపల్లవి ‘గార్గి’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ‘గార్గి’ సినిమా కథ చాలా బోల్డ్ గా ఉందని, దాన్ని దర్శకుడు కాస్తంత సున్నితంగా తీసి ఉంటే బాగుండేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించిన ‘గార్గి’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
జూలై 22న ఏడు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అందులో చెప్పుకోదగ్గది నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. విక్రమ్ కుమార్ గతంలో నాగార్జున ఫ్యామిలీతో ‘మనం’ లాంటి సూపర్ హిట్ మూవీ తీసి ఉండటం దానికి కారణం. ‘జోష్’ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత మళ్ళీ ‘దిల్’ రాజు, నాగచైతన్య కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈసారి మరింత జాగ్రత్తగా ఈ మూవీని వారు చేసి ఉంటారని అంతా భావించారు. కానీ ‘థ్యాంక్యూ’ చూసిన వారు కొత్తదనం లేకపోవడంతో ‘సారీ’ చెప్పేశారు. అదే వారం సునీల్, అనసూయ నటించిన ‘దర్జా’తో పాటు ‘జగన్నాటకం’, ‘మీలో ఒకడు’ వంటి సినిమాలు వచ్చాయి. తమిళ అనువాద చిత్రం ‘మహ’, హిందీ డబ్బింగ్ మూవీ ‘షంషేరా’ కూడా అదే వారం విడుదలయ్యాయి. ధనుష్ నటించిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ద గ్రే మ్యాన్’ సైతం ఆ వీకెండ్ లోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ధనుష్ పాత్ర మరీ చిన్నది కావడం, అదేమంత ప్రాధాన్యమున్న పాత్ర కాకపోవడంతో మనవాళ్ళు పెదవి విరిచారు.
జూలై చివరి వారంలో రెండు అనువాద చిత్రాలతో పాటు రెండు స్ట్రయిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. కిచ్చా సుదీప్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విక్రాంత్ రోణ’ ఎట్టకేలకు 28వ తేదీ జనం ముందుకొచ్చింది. ఈ ఫాంటసీ థిల్లర్ మూవీ మేకింగ్ పరంగా బాగున్నా, కథ, కథనాలలో పట్టు లేకపోవడంతో ప్రేక్షకులు నిరాసక్తత కనబరిచారు. అలానే తమిళియన్ శరవణన్ నటించిన ‘ది లెజెండ్’ మూవీకి ఎలాంటి స్పందన రాలేదు. ఇక మాస్ మహరాజ రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న రిలీజైంది. ఈ యేడాది ఫస్ట్ హాఫ్ లో రవితేజ నటించిన ‘ఖిలాడీ’ మూవీ విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే చిత్రంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ చూసిన కొందరు ‘ఖిలాడీ’నే కాస్తంత బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే రోజు వచ్చిన ‘పంచతంత్ర కథలు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం చతికిల పడింది.
మొత్తం మీద జూలై నెలలో 18 స్ట్రయిట్ మూవీస్, 13 డబ్బింగ్ సినిమాలు విడుదలైతే ఏ ఒక్కటీ కమర్షియల్ హిట్ అందుకోలేదనే చెప్పాలి. ఆగస్ట్ నెల ఎలా ఉంటుందో చూడాలి. ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ మూవీ ‘బింబిసార’తో పాటు పాన్ ఇండియా మూవీ ‘సీతారామం’ జనం ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది అగ్ర నిర్మాతలు షూటింగ్స్ బంద్ చేస్తామని చెబుతున్నారు. ఏ రకంగా చూసినా ఇది టాలీవుడ్ కు గడ్డు కాలమే!