ఒక క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ చాలా అంచనాలతో థియేటర్స్ కి వస్తారు. మరో క్లాసిక్ ఇస్తాడేమో అని ఆశ పడతారు. అయితే అన్ని సార్లు అనుకున్నట్లు అవ్వకపోవచ్చు, క్లాసిక్ హిట్ ఇచ్చిన వాళ్లు కూడా నిరాశపరుస్తారు అని నిరూపించాడు ‘ఆల్ఫనోస్ పుత్రెన్'(Alphonse Puthren). తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్కరూ ‘ప్రేమమ్’ సినిమాని మిస్ అవ్వకుండా చూసే ఉంటారు. బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా రూపొందిన ‘ప్రేమమ్’ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. ఈ మూవీని చూసిన తర్వాత, ఎంతోమంది అబ్బాయిలు ‘నివిన్’ లాగా బ్లాక్ షర్ట్ వేసి లుంగీ కడితే… అమ్మాయిల్లో చాలా మంది ‘సాయి పల్లవి’లా చీర కట్టుకోని కాలేజ్ ఫంక్షన్స్ కి వెళ్లారు. యూత్ కి ఇలాంటి ఒక లవ్ స్టొరీ సినిమా ఇచ్చిన దర్శకుడు ‘ఆల్ఫనోస్ పుత్రెన్'(Alphonse Puthren) దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా ‘గోల్డ్'(Gold). ఏడేళ్ల విరామం తర్వాత ‘ఆల్ఫనోస్ పుత్రెన్’ నుంచి ‘గోల్డ్’ అనే సినిమా వస్తుంది అనగానే ఆడియన్స్ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ ‘పృథ్వీరాజ్’, లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు అనడంతో ‘గోల్డ్’ మరో ‘ప్రేమమ్’ అవుతుందని అందరూ నమ్మారు.
మొబైల్ షాప్ ఓనర్ అయిన ‘జోషి’కి ‘రాధా’ అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యాక అతనో కార్ కొంటాడు. ఇక్కడి నుంచి అతని లైఫ్ లో ఎలాంటి టర్న్స్ వచ్చాయి అనే కథతో ‘గోల్డ్’ సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘ఆల్ఫనోస్ పుత్రెన్’ మరో క్లాసిక్ తీసాడు అనుకోని థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ కి పెద్ద షాక్ తగిలింది. ‘గోల్డ్’ సినిమా షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, సినిమాకి తక్కువ అన్నట్లు ఉందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. పృథ్వీ, నయనతార లాంటి స్టార్ కాస్ట్ ని పెట్టుకోని ‘ఆల్ఫనోస్ పుత్రెన్’ నిరాశపరిచాడంటూ డిజప్పాయింట్ అవుతున్నారు. ‘గోల్డ్’ సినిమాని చూసిన ప్రేక్షకులు “అక్కడక్కడ తళుక్కున మెరిసే రెండు మూడు సీన్స్ మినహా, రెండు గంటల నలబై అయిదు నిమిషాల పాటు చూడాల్సిన సినిమా అయితే కాదు” అంటున్నారు. తెరకెక్కించే అన్ని సినిమాలు క్లాసిక్స్ అవ్వాల్సిన లేదు కానీ మరీ తీసేసే సినిమాలు తెరకెక్కించడం ఆ దర్శకుడి క్రెడిబిలిటీనీ దెబ్బ తీసే విషయమే. సినీ అభిమానులని తీవ్రంగా నిరసపరిచిన ‘ఆల్ఫనోస్ పుత్రెన్’ తన నెక్స్ట్ సినిమాతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.