Tadka: జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ లో మంచి దర్శకుడూ ఉన్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ ను నిర్మించడమే కాదు… మనసుకు నచ్చితే తనే మెగా ఫోన్ పట్టుకున్న సందర్భాలూ కొన్ని ఉన్నాయి. 2010లో ప్రకాశ్ రాజ్ మొదటిసారి ‘నాను నాన్న కనసు’ అనే కన్నడ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ‘ధోని’ మూవీకి దర్శకత్వం వహించాడు. మలయాళ చిత్రం ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ ను ప్రకాశ్ రాజ్ ఏకంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేశాడు. కన్నడ వర్షన్ చక్కని విజయాన్ని అందుకుంది కానీ తెలుగు, తమిళ భాషల్లో ఫ్లాప్ అయ్యింది. ‘ఉలవచారు బిర్యాని’ పేరుతో తెలుగులో వచ్చిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కు జోడీగా స్నేహ నటించింది. ఆ మూవీ 2014లో విడుదల కాగా, ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ ‘మన వూరి రామాయణం’ మూవీని డైరెక్ట్ చేశాడు. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమా కూడా పరాజయం పాలు కావడంతో ప్రకాశ్ రాజ్ తెలుగులో మళ్లీ డైరెక్షన్ చేయలేదు.
‘ఉలవచారు బిర్యానీ’ మూవీని హిందీలో ప్రకాశ్ రాజ్ రీమేక్ చేశాడు. ఇందులో తాను నటించకుండా తన పాత్రకు నానా పటేకర్ ను ఎంచుకున్నాడు. దీనికి ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించాడు. 2016లో మొదలైన ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగింది. మొత్తానికీ కొంత కాలం క్రితం పూర్తయ్యింది. ఇందులో నానా పటేకర్ సరసన శ్రియా శరన్ నాయికగా నటించగా, యువ జంటగా అలీ ఫాజల్, తాప్సీ పన్ను కనిపించబోతున్నారు. ఎంతో కాలంగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నెల 4వ తేదీన ‘తడ్కా’ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి తొలిసారి హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రకాశ్ రాజ్ కు ఎలాంటి అభినందనలు దక్కుతాయో చూడాలి.