భారత చిత్రసీమలో ఇప్పుడున్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. అనతి కాలంలోనే పాన్ ఇండియా నటిగా అవతరించిన ఈమెకు.. వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. పైగా.. ఈమె పట్టిన ప్రతీ ప్రాజెక్టూ హిట్టేనని టాక్ ఉండడంతో, ఈమెనే ప్రధానంగా తమ సినిమాల్లో తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ ఎగబడుతున్నారు. కొందరు ఆమెను లక్కీ చార్మ్‌గా భావించి, రిపీటెడ్‌గా తమ సినిమాల్లో తీసుకుంటున్నారు కూడా! అలాంటి ఫిల్మ్ మేకర్స్‌లో హరీశ్ శంకర్ ఒకరు.
పూజాతో కలిసి చేసిన దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేశ్ సినిమాలు మంచి విజయాలు నమోదు చేయడంతో.. పవన్ కళ్యాణ్‌తో చేయనున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలోనూ ఆమెనే కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు హరీశ్. ఆల్రెడీ ఒప్పందాలన్నీ జరిగిపోయాయి. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తే, అప్పుడు తాను షూట్‌లో పాల్గొనడానికి రెడీ అన్నట్టుగా పూజా హెగ్డే డీల్ కుదుర్చుకుంది. కానీ, ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యమవుతూ వస్తుండడం, అందుకు తగినట్టు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్లే.. పూజా హెగ్డే తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో, మేకర్స్ మరో కథానాయిక కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
కాగా.. గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నట్టు రీసెంట్‌గానే హరీశ్ కన్ఫమ్ చేశాడు.