ప్రముఖ మలయాళ హీరో దిలీప్ నటించిన ‘కేశు ఈ వీడిండే నాథన్’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నటుడిగా కాస్తంత గ్యాప్ తీసుకుని దిలీప్ చేసిన సినిమా ఇది. ఈ కథ ఇలా ఉంటే… తాజాగా గురువారం కేరళకు చెందిన మూడు పోలీస్ బృందాలు దిలీప్, అతని సోదరుడు ఇంటిపై దాడులు నిర్వహించాయి. 2017లో దిలీప్ ప్రముఖ కథానాయికను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసు ఒకటి పోలీసుల విచారణలో ఉంది. దీనిని విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ అధికారులను దిలీప్ బెదిరించడంతో ఇప్పుడీ తాజా సంఘటన చోటు చేసుకుంది. దిలీప్ ఇంటితో పాటు అతని నిర్మాణ సంస్థ గ్రాండ్ ప్రొడక్షన్ కార్యాలయంలోనూ పోలీసులు సోదా చేసినట్టు తెలుస్తోంది.
దిలీప్ ఇంటి తలుపు వెంటనే తెరవకపోవడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గోడ దూకి లోపలకు వెళ్ళారని, ఆ తర్వాత దిలీప్ సోదరి గేట్లు తెరిచిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే దిలీప్ పోలీస్ అధికారులను ఫోన్ లో బెదిరించిన ఆడియో సంభాషణ కొద్ది రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు అనవసరంగా తమను ఈ కేసులో ఇరికించి, ప్రజల ముందు పరువు తీయాలని చూస్తున్నారని దిలీప్ సోదరి ఆరోపించింది. అలానే తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కూడా కుటుంబ సభ్యులు కొందరు తీసుకున్నారు. అయితే కోర్టు ఆర్డర్ ను దృష్టిలో పెట్టుకుని వారిని అదుపులోకి తీసుకోకుండా ఒకేసారి దిలీప్, అతని సోదరుడి ఇంటిపై పోలీసులు దాడి చేయడం ఇప్పుడు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.