Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్‌గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెల్సిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాంతో పాటు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలను అభిమానులు పగలగొట్టారనే దానిమీద కూడా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడ జైల్ కు తరలించారు. తాజాగా పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా..నేడు అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్‌ని ఆదేశించింది.
బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో హైలైట్ గా నిలిచింది ఈ సీజన్ మాత్రమే. ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ గా కావడం ఒక ఎత్తు అయితే.. అతను బయటకు వచ్చి అరెస్ట్ అవ్వడం మరో ఎత్తు అని చెప్పాలి. హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ నిజం కాదని, బయట అతడు చేసిన రచ్చనే చెప్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అమర్ కారు దాడి గురించి కూడా ప్రశాంత్ కు ముందే తెలుసు అని, అయినా ఆ దాడిని ఆపలేదని అమర్ ఫ్రెండ్ ఆరోపించాడు. ఇక అసలు తనకేం తెలియదని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. మరి ఈ వివాదం ఎక్కడవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.