Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. మహానటి చిత్రంతో అందరి మన్ననలు అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్నా దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమిత్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ప్రభాస్ ఇంట్లో జరిగిన విషాదం వలన ఈ సినిమా షూటింగ్ కొద్దిగా వాయిదా పడింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాలనే ప్రాజెక్ట్ కె ఉండనున్నదని, అందులో కొద్దిగా సైన్స్ మిక్స్ చేసి నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ పుకార్లకు దిమ్మ తిరిగే ఆన్సర్ చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. ఈ రూమర్స్ పై నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ ” ప్యారడైస్ దగ్గర దిగిన బస్సు దిగిన ప్రతోడు బిర్యానీ తినడు” అంటూ ట్వీట్ చేశాడు. అంటే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమా ఒకేలా ఉండదు అని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. దీంతో రూమార్స్ కు చెక్ పడినట్లు అయ్యింది. ఇక నెటిజన్లు.. ఏంటి భయ్యా అంత హార్ష్ గా చెప్పాలా.. అప్డేట్ ఏమైనా ఇవ్వొచ్చు గా అని కొందరు.. ఈ ఒక్క మాట చెప్పి ఫ్యాన్స్ ఆందోళన తగ్గించావ్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.