ఆ మధ్య కుడిచేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి, కొద్ది రోజుల పాటు చేతికి రెస్ట్ ఇచ్చి ఇప్పుడు రఫ్ఫాడించడం మొదలెట్టేశారు. చేయినొప్పి కారణంగా ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్ కు కాస్తంత విరామం ప్రకటించిన చిరంజీవి, తిరిగి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు… ఇప్పుడు మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలకూ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. కె. ఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ 6వ తేదీ అంగరంగ వైభవంగా ఉదయం 11.43 నిమిషాలకు ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా అదే రోజు మధ్యాహ్నం 12. 06కు మూలవిరాట్ దర్శనం చేయిస్తానని దర్శకుడు రవీంద్ర (బాబీ) హామీ ఇస్తున్నాడు. సో… సినిమా ప్రారంభం రోజునే చిరంజీవి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాబోతోందన్నమాట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ 154వ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత చిరంజీవితోనే మెహర్ రమేశ్ ‘వేదాలం’ రీమేక్ చేయబోతున్నాడు.