‘బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా’ వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో రమేశ్ గనమజ్జి నిర్మిస్తున్న ‘బ్యాచ్’ మూవీలో సాత్విక్ వర్మ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి భాగం ‘బ్యాచ్ 1’ను ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. నేహా పఠాన్ హీరోయిన్ గా నటించిన ఈ ‘బ్యాచ్’ మూవీకి రఘు కుంచె సంగీతం అందించారు. చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ, ”యూత్ ని టార్గెట్ చేసి తీసిన చిత్రమిది. బెట్టింగ్, మేల్ ప్రాస్టిట్యూషన్ నేపథ్యంతో సాగే కథ ఇది. రఘు కుంచే అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకులను చేరాయి. మా చిత్రానికి చక్కని ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాం” అని అన్నారు.
చిత్ర నిర్మాత రమేష్ గనమజ్జి మాట్లాడుతూ, ”ఇప్పుడున్న పరిస్థితుల్లో మా సినిమా బిజినెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా సహకరించారు. ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ వచ్చింది” అని తెలిపారు. ఇందులో ‘బాహుబలి’ ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్నా, మిర్చి మాధవి, సంధ్యాజనక్ ,మేకా రామకృష్ణ, డి.ఎస్. రావు ,చాందిని బతీజ్ , వినోద్ నాయక్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.