మంచు వారి అబ్బాయి విష్ణువర్ధన్ బాబు తండ్రి మోహన్ బాబు లాగే కంచు కంఠం వినిపిస్తూ ఉంటారు. సినిమాల్లో దాదాపుగా తండ్రిని అనుకరిస్తూ నటించే మంచు విష్ణు, మొన్న జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ తనదైన బాణీ పలికించారు. అందరినీ కలుపుకుపోతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ మంతా ఒక ఫ్యామిలీ’ అనే నినాదంతో ‘మా’ అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఆ మధ్య ప్రతి రోజూ వార్తల్లో నిలిచారు.
హీరోగా అనేక చిత్రాలలో నటించినా, మంచు విష్ణుకు విజయమాధుర్యాన్ని చవిచూపిన చిత్రాలు కొన్నే అని చెప్పవచ్చు. తండ్రి మోహన్ బాబు లాగే మంచు విష్ణు కూడా విద్యావేత్త అనిపించుకున్నారు. ‘స్ప్రింగ్ బోర్డ్ అకాడెమీ’, ‘స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్’కు ఛైర్మన్ గా ఉన్నారు విష్ణు. తన విద్యాసంస్థలతో ఎంతో బిజీగా ఉన్నా, విష్ణు తన సినిమా కుటుంబ సభ్యులకు సేవ చేయాలన్న అభిలాషతో ‘మా’కు అధ్యక్షునిగా నిలిచారు. కోరుకున్నట్టుగానే గెలిచారు. విష్ణు ‘మా’ అధ్యక్షునిగా ఏం చేస్తారో చూడాలని టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మంచు విష్ణు 1981 నవంబర్ 23న జన్మించారు. తండ్రి మోహన్ బాబు విలక్షణ నటునిగా సాగడం చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్నారు విష్ణు. మద్రాసులోని పద్మాశేషాద్రి బాలభవన్ స్కూల్ లో చదివారు. తరువాత తన తండ్రి నిర్వహిస్తోన్న ‘శ్రీవిద్యానికేతన్’లోనే కంప్యూటర్ సైన్సెస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నిజానికి తండ్రి మోహన్ బాబుకు ,
విష్ణును పోలీసాఫీసర్ గా చూడాలన్న అభిలాష ఉండేది. తన తండ్రి నటించిన ‘రగిలే గుండెలు’లో బాలనటునిగా కనిపించారు విష్ణు. అప్పటి నుంచీ విష్ణు మనసులో నటనాభిలాష తిష్ట వేసుకుంది. అయితే, చదువు పూర్తయ్యే వరకు తన మనసులోని మాట బయట పెట్టలేదు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే అసలు విషయం చెప్పారు విష్ణు. తండ్రి కూడా కాదనలేదు.
అలా తన పేరు ‘విష్ణు’ టైటిల్ తోనే రూపొందిన చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు . ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత వచ్చిన మూడు చిత్రాలు సైతం అంత సంతృప్తి కలిగించలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’తో విష్ణుకు మంచి విజయం లభించింది. “దేనికైనా రెడీ, దూసుకెళ్తా” చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు విష్ణు. తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్ తో కలసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో భలేగా వినోదం పండించారు విష్ణు.
‘రౌడీ’లో తండ్రి మోహన్ బాబుతోనూ, తన తండ్రి గురువుగారయిన దాసరి నారాయణరావుతో ‘ఎర్రబస్సు’లోనూ నటించారు విష్ణు. “ఈడో రకం -ఆడో రకం, లక్కున్నోడు, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్ళు” వంటి చిత్రాలతో జనాన్ని పలకరించారు. తండ్రి మోహన్ బాబుతో ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విష్ణు. ‘ఢీ’ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘డి అండ్ డి – డబుల్ డోస్’లో హీరోగా నటిస్తున్నారాయన.
మోహన్ బాబు తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు బడిపంతులుగా పనిచేశారు. అందువల్ల మోహన్ బాబు చదువు అంటే ఓ ప్రత్యేకమైన గౌరవం. ఆయన కొన్నాళ్లు ఓ స్కూల్ లో పీ.ఇ.టి. గా ఉన్నారు. విద్య మనిషికి ఎంత అవసరమో తెలిసిన వ్యక్తిగా ‘శ్రీవిద్యానికేతన్’ సంస్థను స్థాపించారు మోహన్ బాబు. తన పాఠశాలలో కులమతాలకు అతీతంగా విద్యార్థులకు విద్యబోధించడమే కాదు, పేదవిద్యార్థులకూ ఆశ్రయం కల్పిస్తున్నారు మోహన్ బాబు.
తరువాత అదే విద్యాసంస్థ ఇంజనీరింగ్ కళాశాలగానూ మారింది. తన విద్యాసంస్థ కోసం తండ్రి పడ్డ తపన కళ్ళారా చూసిన విష్ణుకు కూడా ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్స్ నెలకొల్పాలన్న అభిలాష కలిగింది. తత్ఫలితంగానే ‘స్ప్రింగ్ బోర్డ్ అకాడెమీ’కి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఈ అకాడెమీ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఓ వైపు సినిమా, మరో వైపు విద్యాసంస్థలు, ఇంకో వైపు ‘మా’ అధ్యక్ష పదవి – కేవలం 40 ఏళ్ళ వయసులోనే ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న విష్ణు మునుముందు ఏ రంగాల్లో అడుగు పెడతారో చూడాలి.