మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ మధ్య గత కొన్నేళ్ళుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా మోహన్ లాల్ ఆధిపత్యం కొనసాగుతోంది. మమ్ముట్టి బాక్సాఫీస్ వద్ద బడా హిట్ కొట్టి చానాళ్ళయింది. తమ హీరో తప్పకుండా సూపర్ హిట్ తో వస్తాడని మమ్ముట్టి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక గత వారం నెరవేరింది. మమ్ముట్టి తాజా చిత్రం ‘భీష్మపర్వం’ గత శుక్రవారం విడుదలై స్మాషింగ్ హిట్ సాధించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్ళ పరంగాను దుమ్ముదులుపుతోంది. కేరళలో తొలి వారాంపు వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకూ ఆ రికార్డ్ మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ పేరుమీద ఉంది. ఇప్పుడు మోహన్ లాల్ రికార్డ్ ను మమ్ముట్టి స్మాష్ చేసేశాడు.
అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అనసూయ, నదియా, శ్రీనాద్, ఫర్హాన్ ఫాజిల్ నెడుముడి వేణు, అరుణ్ కుమార్ నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఇప్పటి వరకూ మలయాళ పరిశ్రమలో అత్యధిక తొలి వారాంతపు వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలుగా ‘భీష్మ పర్వం’, ‘లూసిఫర్’, ‘బాహుబలి 2’, ‘కాయం కులం కొచ్చున్ని’, ‘ఒడియన్’ నిలిచాయి. అనసూయ నటించిన తొలి మలయాళ చిత్రమిది. తన తొలి మలయాళ చిత్రమే ఇండస్ట్రీ హిట్ గా నిలవటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది అనసూయ.