దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో భారీతనం ఎంతుంటుందో అందరికీ తెలుసు. నటీనటులు సైతం ప్రముఖులే ఉంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయన హేమాహేమీల్ని రంగంలోకి దింపుతాడు. అలాంటప్పుడు హీరోయిన్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? ఫలానా పాత్రకు సరిగ్గా సూటవుతుందా? లేదా? అని ఒకటికి పదిసార్లు లెక్కలేసుకొని.. స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతాడు. ఒకవేళ నిడివి చిన్నదైనా సరే, స్టార్లనే తీసుకుంటాడు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విషయంలోనూ ఆ స్ట్రాటజీలనే జక్కన్న అనుసరిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. మహేశ్‌తో చేస్తోన్న ప్రతిష్టాత్మక సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాయ్‌ని తీసుకోవాలని జక్కన్న ఫిక్సయ్యాడట! మరి, ఇప్పటివరకూ ఆ మాజీ మిస్ వరల్డ్‌తో సంప్రదింపులు జరిగాయో లేదో తెలీదు కానీ.. ఐశ్వర్యనే హీరోయిన్‌గా ఫైనల్ చేయనున్నట్టు జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అది నిజమే అయితే.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ తోడైనట్టే! ఐశ్వర్య రాయ్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈమధ్య ఆమె సినిమాలు చేయకపోయినా, ఆమె పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు సంబంధించిన ఒక చిన్న వార్త కూడా, జాతీయంగా పెద్ద హల్‌చల్ చేస్తాయి. అలాంటి అందాల భామ మహేశ్ పక్కనే నటిస్తే.. మామూలుగా ఉండదు. వెండితెర దద్దరిల్లిపోవడం ఖాయం. మరి, ఈ కాంబో కుదురుతుందా? లేదా? అన్నదే వేచి చూడాలి.
ఇదిలావుండగా.. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్ బాబుని ఒక కొత్త లుక్‌లో జక్కన్న చూపించబోతున్నాడట! అటు, మహేశ్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమా ముగిసిన వెంటనే, రాజమౌళి చిత్రాన్ని మహేశ్ ప్రారంభించనున్నాడు. ఈ చిత్రానికి అతను రెండు సంవత్సరాల డేట్స్ జక్కన్నకి ఇచ్చేసినట్టు తెలుస్తోంది.