Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరంటే- మహేశ్ బాబు అనే చెబుతారు. అంతేకాదు టాలీవుడ్ సూపర్ స్టార్ గానూ జేజేలు అందుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మహేశ్. చిన్నతనం నుంచీ తండ్రి కృష్ణలాగే తానూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు మహేశ్. ఆ ప్రయత్నం ఫలించి, ఇప్పుడు టాప్ స్టార్ గా జనం మదిని గెలిచారు.
మహేశ్ బాబు 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించారు. మహేశ్ పుట్టే నాటికే ఆయన తండ్రి కృష్ణ శతచిత్రాలు పూర్తి చేసుకొని జైత్రయాత్ర చేస్తున్నారు. చిన్నతనం నుంచీ తండ్రితో తిరుగుతూ సినిమా వాతావరణం చూసిన మహేశ్ నాన్నతో కలసి ‘పోరాటం’లో తొలిసారి తెరపై తళుక్కు మన్నారు. బాలనటునిగానే భళా అనిపించారు మహేశ్. తండ్రి కృష్ణను నటశేఖరునిగా జనం మదిలో నిలిపిన ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ ను బాల్యంలోనే ధరించి పరవశింప చేశారు మహేశ్. ఇక చిత్రసీమలో యంగ్ హీరోగా అడుగు పెట్టిన తరువాత తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ ఫ్యాన్స్ ను మురిపించారు మహేశ్. తెలుగు చిత్రసీమకు కౌబోయ్ ని పరిచయం చేసిన కృష్ణ తనయునిగా మహేశ్ ‘టక్కరిదొంగ’లో కౌబోయ్ గా జనం ముందు నిలిచారు. వైవిధ్యం కోసం కృష్ణ ‘అఖండుడు’లో మాయమై పోయే పాత్రలో నటిస్తే, మహేశ్ ‘నాని’లో బాలుని నుండి ఏకంగా యువకునిగా మారే విలక్షణమైన పాత్రలో కనిపించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని మట్టుపెట్టడానికి ‘పగసాధిస్తా’నంటూ కృష్ణ ఆ రోజుల్లో సందడి చేస్తే, ‘నిజం’ నిగ్గు తేలుస్తానంటూ మహేశ్ తన కెరీర్ లో ముందుకు సాగారు. ఇలా పలు విధాల నటనలో తండ్రి కృష్ణను గుర్తు చేస్తూ ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకున్నారు మహేశ్.
కొన్ని విషయాల్లో తండ్రి కృష్ణను అనుసరించిన మహేశ్, మరికొన్ని చోట్ల తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. కృష్ణ కెరీర్ లో ఉత్తమ నటునిగా ఒక్క నంది అవార్డు కూడా లభించలేదు. అయితే ‘నిజం’తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్, ఆ తరువాత ‘అతడు, దూకుడు, శ్రీమంతుడు’ చిత్రాల ద్వారా కూడా ఉత్తమ నటునిగా నంది అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే కృష్ణ నటజీవితంలో మొత్తం 300పై చిలుకు చిత్రాలలో కేవలం రెండంటే రెండు డైరెక్ట్ జూబ్లీస్ ఉన్నాయి. అవి ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’. ఈ రెండు చిత్రాలు కూడా కృష్ణ సొంత చిత్రాలు కావడం విశేషం. అయితే మహేశ్ బాబు కెరీర్ లో నాలుగు చిత్రాలు డైరెక్ట్ గా నాలుగు ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అవి ఏవంటే “మురారి, ఒక్కడు, అతడు, పోకిరి”. మరో విశేషమేమంటే ఈ నాలుగు చిత్రాలు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో సిల్వర్ జూబ్లీ జరుపుకొని ఓ చెరిగిపోని రికార్డును మహేశ్ సొంతం చేశాయి. ఆ తరువాత కూడా మహేశ్ కు “దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు” వంటి సూపర్ హిట్స్ దక్కాయి. వీటిలో ‘శ్రీమంతుడు’ కూడా రజతోత్సవం చేసుకుంది.
తండ్రిలాగే మహేశ్ కూడా నిర్మాతగా మారారు. ఆయన నిర్మాణ భాగస్వామిగా ‘ఎమ్.బి.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మితమైన తొలిచిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా మంచి విజయాన్ని చూసింది. ఆ తరువాత “బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట” వంటి చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. అడివి శేషు హీరోగా మహేశ్ బాబు ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మించగా, ఆ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకుంది. ఇక మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా 175పైగా స్క్రీన్స్ లో ఆయన మేటి సినిమా ‘పోకిరి’ ప్రదర్శితం కానుంది. రాబోయే తన చిత్రాలతో మహేశ్ బాబు ఇంకా ఏ తీరున అలరిస్తారో చూడాలి.