ప్రతి మనసులో రాతగాడు దాగుంటాడో లేదో కానీ, ప్రతి మనిషిలో ఓ పాటగాడు మాత్రం తప్పనిసరిగా ఉంటాడు అంటారు మానసిక నిపుణులు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరూ కూనిరాగాలు తీసేవారే. చివరకు బుద్ధిమాంద్యం ఉన్నవారిలోనూ పాట పాడాలనే తలంపు ఉంటుందనీ చెబుతారు. నేడు గీత రచయితగా తనదైన పంథాలో పయనిస్తున్న చంద్రబోస్ చదువుకున్నది ఇంజనీరింగ్. గాయకుడు కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. కానీ, చిత్రంగా వందలాది మంది గాయకుల నోట తన పాటను పలికించే స్థాయికి చేరుకున్నారాయన. ఇప్పటికీ చంద్రబోస్ పాటలతో బాక్పాఫీస్ వద్ద జయకేతనం ఎగురవేస్తున్న చిత్రాలు ఎన్నెన్నో వస్తున్నాయి. చంద్రబోస్ పాటకు జనం పట్టాభిషేకం చేస్తూనే ఉన్నారు.
వరంగల్ జిల్లా చల్లగరిగెలో చంద్రబోస్ 1973 మే 10న జన్మించారు. ఆయన తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహిణి. నలుగురు సంతానంలో చంద్రబోస్ చివరివాడు. వారిది కుగ్రామం. అప్పుడప్పుడూ ఊరిలో నాటకాలు, ఒగ్గుకథలు, చిందు భాగవతాలు సాగేవి. తల్లి వెంట వెళ్ళే చంద్రబోస్ ను అవి ఆకర్షించాయి. దాంతో అతనూ ఏదో ఒక పదం పట్టుకొని కూనిరాగాలు తీస్తూ ఉండేవాడు. కాస్త పెద్దయ్యాక పద్యాలు రాయడం, పాటలు అల్లడం నేర్చాడు బోస్. ఇంటి పక్కనే ఉన్న గుడిలో భజన పాటలు పాడేవాడు. వాళ్ళ ఊరిలోకి సినిమా హాలు వచ్చాక, సినిమాలు చూడడం, వాటిపై ఆసక్తి పెంచుకోవడం జరిగింది. అయితే ఏ నాడూ చదువును అశ్రద్ధ చేయలేదు. ఎప్పుడూ చదువులో ప్రథమశ్రేణిలోనే పాసయ్యేవాడు. డిప్లొమా పూర్తయ్యాక, హైదరాబాద్ జె.ఎన్.టి.యూ.లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ఇంజనీరింగ్ చేశాడు. అదే సమయంలో మిత్రుల సాయంతో సినిమాల్లో పాటలు పాడే ప్రయత్నం చేశాడు.
కొందరు స్నేహితులు ఇచ్చిన సలహాతో పాటల రచయితగా సాగాలనే ఆశించాడు. 1995లో ముప్పలనేని శివ దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’ చిత్రంలో చంద్రబోస్ తొలిసారి పాట రాశాడు. శ్రీలేఖ స్వరకల్పనకు అనువుగా “మంచుకొండల్లోన చంద్రమా…” అంటూ పాట పలికించాడు చంద్రబోస్. అదే ఆ చిత్రానికి హైలైట్ అయింది. ఆ తరువాత చంద్రబోస్ ప్రతిభను గమనించి కె.రాఘవేంద్రరావు తన ‘పెళ్ళిసందడి’లో పాట రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమాలో చంద్రబోస్ రాసిన “సరిగమ పదనిస రాగం…” పాటకు ఉత్తమ గీతరచయితగా నంది అవార్డు కూడా లభించింది. అక్కడ నుంచీ చంద్రబోస్ మరి వెనుతిరిగి చూసుకోలేదు. ఆ పై ‘ఆది’లోని “నీ నవ్వుల తెల్లదనాన్ని…” పాటతోనూ, ‘నేనున్నాను’లోని “చీకటితో వెలుగే అన్నది నేనున్నాననీ…” పాటకు కూడా చంద్రబోస్ నంది అవార్డులు అందుకున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాల్లో చంద్రబోస్ పాట చిందులు వేసింది. నవతరం భావాలను పొదివి పట్టుకొని, వాటిని తన పాటలోకి నెట్టుకొని చంద్రబోస్ సాగే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ గీత రచయితగా బిజీగా సాగుతున్నారాయన. చంద్రబోస్ పాటలు కొన్ని ఆలోచింప చేశాయి, కొన్ని ఆనందం పంచాయి, మరికొన్ని కన్నీరు పెట్టించాయి. ఇంకొన్ని కితకితలు పెట్టాయి. అలా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్న చంద్రబోస్, ప్రస్తుతం ఓ టీవీలో సాగే పాటల పోటీకి న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు. చంద్రబోస్ పాట ఈ నాటికీ యువతను చిందులు వేయిస్తూనే ఉంది. అందుకు నిదర్శనంగా రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాట నిలుస్తుంది. మునుముందు చంద్రబోస్ మరిన్ని పాటలతో జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.
(మే 10న చంద్రబోస్ పుట్టినరోజు)