(ఫిబ్రవరి 20న విజయనిర్మల జయంతి)
నటిగా, దర్శకురాలిగా ఆ తరం వారిని అలరించారు విజయనిర్మల. లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన విజయనిర్మల ఈ తరం వారి మదిలోనూ చోటు దక్కించుకున్నారు. ఆమె పేరు వినగానే నటశేఖర కృష్ణ, ఆయన గుర్తుకు రాగానే విజయనిర్మల తెలుగువారి మదిలో మెదలుతారు. అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పేరుకు ‘విజయకృష్ణులు’ సార్థకత చేకూర్చారు అనిపిస్తుంది. ఇద్దరూ నటనలోనూ, దర్శకత్వంలోనూ రాణించారు. అలాంటి జంట మరొకటి మనకు కానరాదు. కృష్ణ తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాలలో నటించి ఘనత సాధిస్తే, విజయనిర్మల ప్రపంచంలోనే అత్యధిక కుటుంబ కథా చిత్రాలను రూపొందించి ‘గిన్నిస్ బుక్’లో చోటు సంపాదించారు.
విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న మద్రాసులో జన్మించారు. ఆమె తండ్రికి చిత్రసీమతో మంచి పరిచయాలు ఉండేవి. అప్పట్లో కొన్ని సినిమాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించారు. ‘మచ్చ రేఖై’ అనే తమిళ చిత్రంలో తొలిసారి నాలుగేళ్ళ ప్రాయంలో కనిపించారు నిర్మల. తరువాత యన్టీఆర్ ‘పాండురంగ మహాత్మ్యం’ తెరకెక్కిస్తున్న రోజుల్లో అందులో కీలకమైన బాలకృష్ణుని పాత్రలో ఆమె నటించారు. ఆ పై ‘భార్గవి నిలయం’ అనే మళయాళ చిత్రంలోనూ కనిపించారు. విజయా సంస్థ తమిళంలో నిర్మించిన ‘ఎంగవీట్టు పెన్’ చిత్రంలో నటించారు నిర్మల. ఈ సినిమా తెలుగులో యన్టీఆర్ ‘షావుకారు’ ఆధారంగా తెరకెక్కింది. ‘షావుకారు’ జానకి పోషించిన పాత్రను తమిళంలో నిర్మల ధరించారు. అప్పటికే చిత్రసీమలో పలువురు నిర్మలలు ఉన్న కారణంగా, తనకు తొలిసారి నాయికగా అవకాశం కల్పించిన ‘విజయ’ సంస్థపై అభిమానంతో విజయనిర్మలగా పేరు మార్చుకున్నారామె. ఆ తరువాత నుంచీ నటిగా విజయాలు చూస్తూనే విజయనిర్మల సాగారు. ‘రంగులరాట్నం’ తెలుగు చిత్రంలో కీలక మైన పాత్ర పోషించారు.
తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్ తదితరుల సరసన నాయికగా నటించారు విజయనిర్మల. కృష్ణ, విజయనిర్మల తొలిసారి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సాక్షి’. ఈ సినిమా వీరిద్దరికీ ప్రథమం కాగా, ప్రముఖ చిత్రకారుడు బాపుకు దర్శకునిగా మొదటి చిత్రం. ఇందులో కృష్ణ, విజయనిర్మల జోడీ నటించిన తీరు జనాన్ని ఆకట్టుకుంది. తొలి సినిమాలోనే కృష్ణ చేత మూడు ముళ్ళు వేయించుకొనే పాటలో విజయనిర్మల నటించారు. ఏ ముహూర్తాన ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారో కానీ, నిజజీవితంలో విజయనిర్మల, కృష్ణ భార్యాభర్తలుగా మారారు.కృష్ణకు నిజంగానే విజయనాయికగా మారారు విజయనిర్మల. వారిద్దరూ జంటగా నటించిన చిత్రాలు వరుసగా జనం ముందు నిలుస్తూ వచ్చాయి. దాంతో ఈ జోడీకి రోజు రోజుకూక్రేజ్ పెరుగుతూ వచ్చింది. అప్పట్లో కృష్ణ సంవత్సరానికి పన్నెండు చిత్రాలలో నటించేవారు. ఓ యేడాది ఒకటి రెండు సినిమాలు మినహా అన్నిటా కృష్ణ, విజయనిర్మల జంటనే కనిపించి కనువిందు చేసింది.
కృష్ణ ప్రతి మైలురాయిలోనూ విజయనిర్మల పాత్ర ఉందని చెప్పక తప్పదు. కృష్ణ సాహసాలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తూ, వాటిలో తానూ పాలుపంచుకున్నారు విజయనిర్మల. కృష్ణ ప్రోత్సాహంతోనే విజయనిర్మల దర్శకత్వం చేపట్టారు. తొలుత మళయాళంలో మెగాఫోన్ పట్టి సినిమా తీశారు. ఆ సినిమా ఇచ్చిన స్థైర్యంతో యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ ఆధారంగా అదే పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకురాలిగానూ విజయనిర్మల విజయం సాధించారు. ఇందులో ఆమె పతిదేవుడు కృష్ణనే కథానాయకుడు. ఇప్పటికీ విజయనిర్మల పేరు తలచుకోగానే గుర్తుకు వచ్చే సినిమాలలో ‘మీనా’ ముందు వరుసలో ఉంటుంది. కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు సంపాదించడానికి విజయనిర్మల ప్రోత్సాహమే కారణమని అందరికీ తెలుసు. భర్తలో ఉన్న సాహసమే భార్య విజయనిర్మలోనూ ఉందని చెప్పవచ్చు.
విజయనిర్మల దాదాపు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక కథాచిత్రాలు రూపొందించిన దర్శకురాలిగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన చిత్రాలలో ఎక్కువ సినిమాల్లో కృష్ణనే హీరోగా నటించారు. ‘హేమాహేమీలు’లో ఏయన్నార్ ను డైరెక్ట్ చేశారు విజయనిర్మల. అలాగే ‘రామ్ రాబర్ట్ రహీమ్’లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆమె దర్శకత్వంలో నటించారు.
విజయనిర్మల తనయుడు నరేశ్ కూడా నటనలో రాణిస్తూనే ఉన్నారు. తాను దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తోనే నరేశ్ ను హీరోగా నిలిపారు విజయనిర్మల. కృష్ణ, విజయనిర్మలపై అభిమానంతో తన పేరును విజయకృష్ణ నరేశ్ గా మార్చుకున్నారు. కొన్ని చిత్రాలలో హీరోగా ఆకట్టుకున్న నరేశ్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా బిజీగా సాగుతున్నారు. 2019 జూన్ 27న విజయనిర్మల తుదిశ్వాస విడిచారు. ఈ నాటికీ కృష్ణ పేరుతో విజయనిర్మల నామం కూడా ముడిపడే ఉంది. వారిద్దరిలో ఎవరిని తలచుకున్నా మరొకరు గుర్తుకు రాకమానరు.