టాలీవుడ్‌లోని మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో కృతిశెట్టి ఒకరు. ‘ఉప్పెన’లాంటి బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ అమ్మడికి ఎనలేని క్రేజ్, గుర్తింపు వచ్చేసింది. ఫలితంగా.. వరుసగా క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. రామ్ పోతినేని సరసన ‘ద వారియర్’లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కృతిశెట్టి.. తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.
‘‘నా మాతృభాష తుళు. తెలుగు కూడా బాగానే నేర్చుకున్నాను. ఇప్పటివరకూ నేను తెలుగు దర్శకులతో కలిసి పని చేశాను. కానీ, లింగుస్వామి తమిళ దర్శకుడు. అందుకే భాష పరంగా చాలా ఇబ్బంది పెట్టాడు. నాకేమో తమిళం రాదు. ఆయన తెలుగులో ఏమో తమిళ యాస ఉంది. దీంతో.. ఆయన ఏం చెప్పేవారో నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఇలా వారం రోజుల పాటు లింగుస్వామి తెలుగు అర్థం కాక ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే.. రామ్‌కి తమిళం వచ్చు. ఈ విషయం తెలిశాక నేను రామ్ సపోర్ట్ తీసుకున్నాను. డైరెక్టర్ ఏం చెబుతున్నారనేది రామ్ నాకు అర్థమయ్యేలా చెప్పేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అలవాటు పడ్డాను’’ అని కృతి శెట్టి పేర్కొంది.
ఇదే సమయంలో ‘ద వారియర్’లోని తన పాత్ర గురించి కృతి మాట్లాడుతూ.. తాను ఈ చిత్రంలో రేడియో జాకీగా కనిపిస్తానని, తన పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పింది. ఈ సినిమా కచ్ఛితంగా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా.. పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి, వాటిని అందుకుంటుందో లేదో రిలీజ్ వరకూ వేచి చూడాలి.