‘కేకే ఇట్స్ నాట్ ఓకే’ అంటున్నారు లక్షలాది అభిమానులు. కేకే పాడిన ప్రతి పాటను గుండెల్లో దాచుకున్న సంగీత ప్రియులు అతని హఠాన్మరణ వార్త విని తట్టుకోలేకుండా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పాటతోనే ప్రయాణం చేసి, చివరి నిమిషం వరకూ పాడుతూ ఉన్న కేకే మరణాన్ని వారు భరించలేకున్నారు. అశనిపాతంలా తాకిన ఈ వార్తను తట్టుకోవడమే కష్టం అనుకుంటే, ఆయన తలపై, ముఖంపై గాయలున్నాయన్న వార్త వారిని మరింత కలవరపరుస్తోంది. కోల్ కతాలో మే 31వ తేదీ రాత్రి కన్నుమూసిన కేకే సంగీత ప్రస్థానం ఈ తరం గాయనీ గాయకులకు స్ఫూర్తిదాయకం!
పాట కోసం ఉద్యోగం వదిలి…
కేకే అసలు పేరు కృష్ణ కుమార్ కున్నత్. అతని పూర్వీకులది కేరళ అయినా, కృష్ణకుమార్ జన్మించింది ఢిల్లీలోనే. సి.ఎస్. మీనన్, కున్నత్ కనకవల్లి దంపతులకు 1968 ఆగస్ట్ 23న కేకే జన్మించాడు. విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరిస్ స్కూల్ జరిగింది. ఆ తర్వాత కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేసి హోటల్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ అసోసియేట్ గా పనిచేశాడు. కానీ పాటల మీద ఉన్న మక్కువ అతన్ని ఉద్యోగం చేయనివ్వలేదు. దానికి రాజీనామా చేసి ముంబై చేరుకున్నాడు. గాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ముందుగా జింగిల్స్ పాడటం మొదలు పెట్టాడు. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ తో కేకేకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి వేలాది జింగిల్స్ కు పనిచేశారు. 1996లో ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ దేశం’లో అటు తమిళ, ఇటు తెలుగులోనూ రెండు పాటలు పాడాడు కేకే. ఈ సినిమా మ్యూజిక్ హిట్ కావడంతో కేకే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆ తర్వాత మూడేళ్ళకు కేకే తొలి సోలో మ్యూజిక్ ఆల్బమ్ ‘పల్’ను లెస్లీ లూయిస్ సంగీత దర్శకత్వంలో తీసుకొచ్చాడు. ఇది అతని బాలీవుడ్ ఎంట్రీకి ట్రంప్ కార్డ్ గా మారింది. దానికి ముందే ‘మ్యాచిస్’ మూవీలో ఓ పాట కోసం గొంతుకలిపినా ‘పల్’తో వచ్చిన గుర్తింపుతో హిందీ చిత్రసీమ అతనికి రెడ్ కార్పెట్ పరిచింది. ‘ హమ్ దిల్ దే చుకే సనమ్’ మూవీ కోసం కేకే పాడిన ‘తడప్ తపడ్’ గీతం మంచి పేరు తెచ్చిపెట్టింది. రెహమాన్ స్నేహితుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినా… కేకే అందరు సంగీత దర్శకులతో పనిచేయడం విశేషం.
తెలుగులోనూ జైత్రయాత్ర!
డబ్బింగ్ సినిమా ‘ప్రేమదేశం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేకే ఆ తర్వాత కూడా ‘వీఐపీ, మెరుపు కలలు’ వంటి అనువాద చిత్రాలకే పాటలు పాడారు. కేకే తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టే సమయంలో ఓ కొత్త వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. సీనియర్ సంగీత దర్శకులతో పాటు యువ సంగీత దర్శకులు సైతం కొత్త గొంతు కోసం అన్వేషణ సాగిస్తున్న తరుణం అది. ఇతర రాష్ట్రాలలో ఉన్న గాయనీ గాయకులతోనూ పాటలు పాడించడానికి దర్శక నిర్మాతలువెనకాడక పోవడంతో సంగీత దర్శకులకు ఓ గొప్ప అవకాశం లభించినట్టు అయ్యింది. ఆ సమయంలోనే కేకేను మనవాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. శాస్త్రీయ సంగీతం అభ్యసించకపోయినా… లయజ్ఞానం ఉండటంతో కేకే ఎలాంటి పాటనైనా అలవోకగా పాడేసే వారు. అందువల్లే తెలుగులోని దాదాపు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి సినిమాలకూ కేకే పాటలు పాడారు. ఆయన గొంతులోని వైవిధ్యం అందరూ హీరోలకూ సూట్ అయ్యేది. చిరంజీవి మొదలు కొని యువ కథానాయకులు తరుణ్, ఉదయ్ కిరణ్ సినిమాలకూ కేకే పాటలు పాడారు. ‘ఇంద్ర’లో ‘దాయి దాయి దామ్మా’ గీతం పాడిన కేకే ఆ తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్, జై చిరంజీవ’ చిత్రాలలోనూ పాడారు. అలానే నాగార్జున ‘సంతోషం’లో పాటలు పాడిన కేకే ‘నేనున్నాను’లోనూ పాడారు. వెంకటేశ్ నటించిన ‘వాసు, ఘర్షణ, మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు కేకే పాటలు పాడారు. అన్నీ హిట్టే! ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ కోసం, తరుణ్ ‘నువ్వే నువ్వే’ కోసం కేకే పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ‘ఖుషీ, జల్సా, గుడుంబా శంకర్’ తదితర చిత్రాలకు కేకే పాడిన పాటలు యువతను సూపర్ గా అట్రాక్ట్ చేశాయి. ఇక ‘ఆర్య, ఆర్య 2’లో పాడిన పాటలూ సూపర్ హిట్టే. రవితేజా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ కోసం కేకే ఆలపించిన ‘గుర్తుకొస్తున్నాయి… ‘మెలోడీ గీతాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అలా కేకే తెలుగులో పాడిన పాటలన్నింటినీ ప్రస్తావిస్తే పెద్ద జాబితానే తయారౌతుంది.
బుల్లితెరపైనా సత్తా చాటిన కేకే!
సంగీతానికి ఎలా అయితే ఎల్లలు ఉండవో, గాయకులకూ అంతే! భాష మీద కాస్తంత పట్టు చిక్కాలే కానీ ఏ భాషలో అయినా అవలీలగా పాడేయొచ్చు. అదే పని కేకే చేశారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనే కాదు ఇతర భారతీయ భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. కేవలం సినిమా పాటలకే పరిమితం కాకుండా బుల్లితెర వైపు అడుగులు వేశారు. ఎన్నో సీరియర్స్ లో ఆయన పాటలు పాడారు. 1999 క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో భారత క్రికెట్ జట్టు మద్దతు కోసం ‘జోష్ ఆఫ్ ఇండియా’ పాటలోనూ కేకే కనిపించారు. అలానే ఫేమ్ గురుకుల్ సింగింగ్ రియాలిటీ షో లో జ్యూరీ మెంబర్ గా ఉన్నారు. ఇండియన్ ఐడల్ జూనియర్స్ సీజన్ 2కూ జడ్జీగా వెళ్ళారు. తొలి మ్యూజిక్ ఆల్బమ్ ‘పల్’ను విడుదల చేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ‘యారో’ పేరుతో రెండో మ్యూజిక్ ఆల్బమ్ ను కేకే రిలీజ్ చేశారు. ఉత్తమ గాయకుడిగా ఎన్నో అవార్డులను అందుకున్న కేకే తన చిన్ననాటి స్నేహితురాలు జ్యోతికృష్ణను 1991లో వివాహం చేసుకున్నారు. వారికి నకుల్, తామర అనే ఇద్దరు పిల్లలు. కుమారుడు నకుల్ తండ్రితో పాటు ‘యారో’ ఆల్బమ్ లో పాట పాడటం విశేషం.
దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కేకే హిందీలో దాదాపు 500కు పైగా పాటలను, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ దాదాపు 200కుపైగా పాటలను పాడాడు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఏర్పరుచుకున్న అతను ‘ఐ యామ్ వెరీ సారీ’ అంటూ హఠాత్తుగా భారత సినీ సంగీత యవనిక నుండి అంతర్థానం కావడం అందరికీ బాధను కలిగిస్తోంది. అయితే కేకే మృతికి అసలు కారణం ఏమిటీ? అతని మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది వీలైనంత త్వరగా అధికారులు ఛేదించడమే అభిమానులకు ఇవ్వగలిగే ఓదార్పు! నాశనం కానిది అక్షరం అన్నట్టుగానే సినిమా పాట ఉన్నంత కాలం కేకే మనతోనే ఉంటారు!