Malvika Nair: నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. గతంలో వీరిద్దరూ కలిసి ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నటించారు. శ్రీనివాస్ అవసరాల దర్వకత్వంలో టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ ఈ నెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక నాయర్ మీడియాతో మాట్లాడారు.
“నటిగా నేను ఎవరనేది చూపించే చిత్రమిది. ఇప్పటిదాకా ఒక నటిగా కొన్ని సినిమాలు చేశాను. నటిగా ఏం చేయాలో అంతవరకే చేశాను. కానీ ఇది అన్ని విభాగాల పరంగా నాకు దగ్గరైన సినిమా. శ్రీనివాస్ గారి లాంటి ప్రతిభగల దర్శకుడితో పని చేయడం సంతోషం కలిగించింది. ఆయన అమెరికా వెళ్లి ఎంతో సాంకేతిక నేర్చుకొని ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాలు చేయడం అభినందించదగ్గ విషయం. ఆయనకు భాషపై మంచి పట్టు, గౌరవం ఉన్నాయి. ఆయన వల్లే నా తెలుగు మెరుగుపడింది. ఇక కథ విషయానికి వస్తే… మామూలుగా ప్రేమ కథలు రెండు మూడేళ్ళ వ్యవధిలో జరిగినట్లు చూపిస్తుంటారు. అయితే ఇందులో 18 నుంచి 28 ఏళ్ల వరకు ప్రయాణం చూపిస్తారు. మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. వయసును బట్టి నాగ శౌర్య పాత్ర తాలూకు వైవిధ్యాన్ని చక్కగా చూపించారు. నేను కూడా నా పాత్రకు పూర్తి న్యాయం చేశానని భావిస్తున్నాను” అని మాళవిక తెలిపింది.
తన కో-స్టార్ నాగశౌర్య గురించి చెబుతూ, “నాగశౌర్య ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. దీన్ని రీమేక్ చేసినా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేరన్నది ఆయన అభిప్రాయం. అంతలా సినిమాలో ఏముంది? అలా ఎందుకు అన్నా? అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. షూటింగ్ సమయంలో అసలు అక్కడ ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందనేది దర్శకుడికి, డీఓపీకి, నటీనటులకు అర్థమవుతుంది. ఆ నమ్మకంతోనే శౌర్య అలా అని ఉంటారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇది ఓ రకంగా ప్రయోగాత్మక చిత్రమే. రెగ్యులర్ సినిమా అనలేను. అలా అని మనకి తెలియని భావోద్వేగాలు కాదు. చూస్తున్నంత సేపు ఓ మంచి అనుభూతి కలుగుతుంది” అని అన్నారు.
ఇక ఈ సినిమాలోని ముద్దు సన్నివేశం విషయానికి వస్తే, “అది నాకు ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సన్నివేశం కాదు. కథలో భాగమైన, కథకి అవసరమైన సన్నివేశం. అలానే దర్శకుడు శ్రీనివాస్ గురించి చెప్పాలంటే, ఆయన చాలా సరదాగా ఉంటారు. ఏమున్నా మనసుని నొప్పించకుండా ముఖం మీదే సున్నితంగా చెప్పేస్తారు. ఆయన నటీనటుల మ్యానరిజమ్స్ మీద దృష్టి పెట్టరు. ఎమోషన్స్ రాబట్టుకోవడం మీద దృష్టి పెడతారు. నిర్మాత వివేక్ గారితో ఇది నాకు రెండో సినిమా. చాలా కూల్ గా, కామ్ గా ఉంటారు. ‘థమాకా’ లాంటి ఘన విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ నాలుగేళ్లలో శ్రీనివాస్ గారికి నిర్మాతలు విశ్వప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. కోవిడ్ సమయంలో మా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.ఇక మా సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ దీనికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన సోదరుడు కీరవాణి గారు ఆస్కార్ గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం” అని తెలిపింది. ప్రస్తుతం ‘అన్నీ మంచి శకునములే, డెవిల్’ చిత్రాలలో మాళవిక నాయర్ నటిస్తోంది.