బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు ఏది న్యాయం అనిపిస్తుందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇలాగే వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక అమ్మడు ఏ సినిమాకైనా రివ్యూ ఇచ్చిందంటే అందులో ఎంతోకొంత వ్యంగ్యం దాగి ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ ల సినిమాలనే అమ్మడు ఏకిపారేసింది. ఇక తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించి తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చింది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించడంతో పాటు రాజమౌళి వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేసింది.
” ఎస్ఎస్ రాజమౌళి సార్ మరోసారి తాను గ్రేటెస్ట్ డైరెక్టర్ అని నిరూపించారు. ఇప్పటివరకు ఆయన తీసిన ఏ సినిమా ప్లాప్ కాలేదు. అన్ని సూపర్ హిట్స్ అందుకున్నాయి. అయితే ఇక్కడ ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఆయన విజయాల గురించి కాదు ఆయన వినయం గురించి చెప్పాలి. ఓ వ్యక్తిగా దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయనకున్న ప్రేమ చాలా గొప్పవి. మీలాంటి రోల్ మోడల్ ఉండడం మా అదృష్టం సార్.. నిజంగా నిజాయితీగా నేను మీ అభిమానిని” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.