అందాలు ఆరబోయడంలోనూ, అందుకు తగ్గ అభినయం ప్రదర్శించడంలోనూ కంగనా రనౌత్ సదా అభినందనలు అందుకుంటూనే ఉంటుంది. అంతలేంది… జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలుస్తుందా చెప్పండి! కేవలం నటనతోనే కాదు, తనకు చాలాకాలంగా అలవాటయిన వెటకారంపైనా కంగనాకు ఎంతో మమకారం ఉందని మరోమారు తేలిపోయింది. అవకాశం చిక్కితే చాలు తారల వారసులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో కంగనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అనన్య పాండేపై కంగనా ఓ సెటైర్ వేసి మళ్ళీ వార్తల్లో నిలచింది.
చాలా రోజులుగా ‘నెపోటిజమ్’పై కంగనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో ఎంతోమంది తారల వారసులపై సెటైర్స్ వేసింది. ఈ మధ్య అలా చేయడం మానుకుందని అనుకుంటే, పొరబాటే అంటూ తాజాగా సెటైర్స్ వేసే తన నైజం ప్రదర్శించింది. ఇటీవల మరోమారు ఆమె ‘కపిల్ శర్మ కామెడీ షో’కు హాజరయింది. ఇందులో పాల్గొన్న కంగనాను, కపిల్, “బాలీవుడ్ బింబోస్” అంటే అర్థమేంటి? అని అడిగాడు. నిజానికి ‘బింబో’ అంటే ‘తెలివిలేని అందమైన పిల్ల’ అని అర్థం! మరి బాలీవుడ్ లో కంగనా దృష్టికి వచ్చిన ‘బింబో’ ఎవరో? అందుకు సమాధానంగా తన నాలుకతో ముక్కును తాకే ప్రయత్నం చేసి, అలా ఎవరైతే పెదాలతో ముక్కును అందుకోగలరో వారే ‘బాలీవుడ్ బింబో’ అని చెప్పింది. ఈమె కన్నా ముందు ‘కపిల్ శర్మ షో’లో చుంకీ పాండే కూతురు, నవతరం నాయిక అనన్య పాండే పాల్గొంది. ఆ షోలో తనకు వచ్చిన విద్యల్లో ‘నాలుకతో ముక్కును అంటుకోవడం’ ఒకటి అని చూపించింది అనన్య. అదే షోలో అలా ట్రై చేసే వారే ‘బాలీవుడ్ బింబో’ అని కంగనా చెప్పడంతో అనన్యను ఉద్దేశించే చెప్పిందనీ అందరూ ఇట్టే అర్థం చేసుకున్నారు. మరి దీనిపై అనన్య స్పందిస్తుందో లేదో చూడాలి.