‘ఆంధ్రా ప్యారిస్’గా పేరొందిన తెనాలి పట్టణంలో యన్టీఆర్ తన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరిట ఓ థియేటర్ ను నిర్మించారు. అదే థియేటర్ ప్రస్తుతం పెమ్మసాని పేరుతో నడుస్తోంది. ఇదే థియేటర్ లో యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ యేడాది మే 28వ తేదీ నుండి వచ్చే యేడాది మే 28వ తేదీ దాకా అంటే సంవత్సరం పాటు యన్టీఆర్ నటించిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రోత్సవం సందర్భంగా పలువురు సినీ, నాటకరంగప్రముఖులను, యన్టీఆర్ తో అనుబంధం ఉన్నవారినీ సన్మానిస్తున్నారు యన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు. జూన్ 26వ తేదీన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును ఈ కమిటీ సన్మానించింది. యన్టీఆర్ తో పదికిపైగా చిత్రాలు రూపొందించిన దర్శకుల్లో మిగిలి ఉన్నవారు కె.రాఘవేంద్రరావు మాత్రమే. పైగా యన్టీఆర్ తో అనేక ఘన విజయాలను చవిచూసిన ఏకైక దర్శకునిగానూ ఆయన చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావుకు సన్మానం అనగానే ఆ మహోత్సవానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఇక యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘వేటగాడు’ చిత్రానికి ఓ చరిత్ర ఉంది. రాఘవేంద్రరావు కెరీర్ లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘వేటగాడు’ నిలచి ఉంది. 1979లో ‘వేటగాడు’ తెనాలి రామకృష్ణ థియేటర్ లోనే విడుదలయింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే థియేటర్ లో జూన్ 27న ‘వేటగాడు’ చిత్రాన్ని తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని రాఘవేంద్రరావు అన్నారు. నందమూరి తారక రామారావుతో నలభై ఏళ్ళ క్రితం తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు రాఘవేంద్రరావు.
పెమ్మసాని థియేటర్ లో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు ఓ యన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. జూన్ 27 ఉదయం 8 గంటలకు జోరున వర్షం కురుస్తున్నా, ‘వేటగాడు’ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై తిలకించడానికి ప్రేక్షకులు విశేషంగా హాజరయ్యారు. “ఇంత వర్షంలోనూ యన్టీఆర్ సినిమా చూడటానికి జనం తండోపతండాలుగా రావడం అంటే ఎంతో విశేషం. అది అన్నగారి గొప్పతనం. నిజంగా ఆయన యుగపురుషుడు” అంటూ రాఘవేంద్రరావు అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రవీంద్రనాథ్, మాటల రచయిత డాక్టర్ సాయినాథ్ బుర్రా, యన్టీఆర్ వీరాభిమాని కొమ్మినేని వెంకటేశ్వరరావు కూడా రాఘవేంద్రరావుతో కలసి ‘వేటగాడు’ సినిమాను వీక్షించారు. అనంతరం థియేటర్ బయట నిలిపిన యన్టీఆర్ సుయోధన విగ్రహం వద్ద రాఘవేంద్రరావు తదితరులు కలసి ఫోటోలు తీయించుకోవడం ఆకట్టుకుంది.