Oscar: మొన్న ఆస్కార్ బరిలో ఉత్తమ చిత్రంగా నిలచిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ పై విమర్శలూ ఉన్నాయి. అబ్జర్డిస్ట్ కామెడీ డ్రామా జానర్ లో రూపొందిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాను ఎలా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు? అకాడమీలో విలువలు తరిగిపోతున్నాయి అందువల్లే ఇలాంటి అర్థం పర్థంలేని చిత్రాలకు సైతం అవార్డులు ఇస్తున్నారు అంటూ అమెరికాలోని సినీఫ్యాన్స్ కొంతమంది విమర్శించారు. అకాడమీ సభ్యులు మాత్రం తమ సంస్థ నియమనిబంధనలను అనుసరించే ఓటింగ్ సాగుతుందని, అధిక ఓట్లు లభించిన వారే విజేతలుగా నిలుస్తారని నొక్కివక్కాణిస్తున్నారు. ఈ విషయాలు పట్టించుకోని విమర్శకులు ప్రతీ యేడాది ఆస్కార్ అవార్డులు రాగానే విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఆస్కార్ అవార్డుల బరిలో నంబర్ వన్ అవార్డుగా భావించే ఉత్తమ చిత్రం విభాగంలో అకామడీ అనుసరించే విధానాలను కొంతైనా అధ్యయనం చేయవలసి ఉంటుంది.
ఆస్కార్ అవార్డుల్లో నంబర్ వన్ అవార్డుగా భావించే ‘బెస్ట్ పిక్చర్’ ఇప్పటికి పలుమారు పేర్లు మార్చుకుంటూ వచ్చింది. 1927లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మొదలయింది. మొదటి మూడు నాలుగేళ్ళలో ఈ అవార్డును ‘అకాడమీ అవార్డ్ ఫర్ ఔట్ స్టాండింగ్ పిక్చర్’ (Academy Award for Outstanding Picture) పేరుతో పిలిచారు. 1930-40 మధ్య కాలంలో ఈ అవార్డుకు ‘అకాడమీ అవార్డ్ ఫర్ ఔట్ స్టాండింగ్ ప్రొడక్షన్'(Academy Award for Outstanding Production) అని పేరు పెట్టారు. 1941, 1942, 1943 సంవత్సరాల్లో మాత్రం ‘అకాడమీ అవార్డ్ ఫర్ ఔట్ స్టాండింగ్ మోషన్ పిక్చర్'(Academy Award for Outstanding Motion Picture) పేరు మీద ఉత్తమ చిత్రం అవార్డులు ప్రదానం చేశారు. 1944లో మళ్ళీ పేరు మార్చారు. అప్పుడు ‘అకాడమీ అవార్డ్ ఫర్ బెస్ట్ మోషన్ పిక్చర్’ (Academy Award for Best Motion Picture) అన్నారు. 1961 దాకా ఈ పేరు మీదే ఉత్తమ చిత్రాలను గౌరవించారు. 1962లో ‘బెస్ట్ మోషన్ పిక్చర్’లో నుండి ‘మోషన్’ను తొలగించి ‘అకాడమీ అవార్డ్ ఫర్ బెస్ట్ పిక్చర్’ (Academy Award for Best Picture)గా కుదించారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా అదే పేరు మీద ఉత్తమచిత్రాలు ఆస్కార్ ను అందుకుంటున్నాయి. ఇలా పలు మార్లు పేర్లు మార్చుకుంటూ వెళ్ళిన ఆస్కార్ బెస్ట్ పిక్చర్ నియమనిబంధనలు సైతం మారుతూ వచ్చాయి. మారే కాలానికి అనుగుణంగా మనమూ మారాలి అంటూ అధిక సంఖ్యాకులైన అకాడమీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డుల ఎంపిక విధానం మారుతూ వస్తోంది.
ప్రస్తుతం ఉత్తమ చిత్రం విభాగంలో అనుసరిస్తున్న విధానంలో నాలుగు అంశాలను ప్రధానంగా పరిగణిస్తున్నారు. మొదటిది – తెరపై మనం చూపించిన కథ, కథనంలో వైవిధ్యం ఉండాలి. సృజనాత్మకత, దాని కోసం చిత్రబృందం చేసిన పరిశ్రమను కూడా గుర్తిస్తారు – ఇది రెండో అంశం. మూడవది – చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు తమకు లభించిన అవకాశాన్ని ఎలా వినియోగించుకున్నారు. ఇక చివరిది, సదరు చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించింది అన్నది. ఈ నాలుగు అంశాలలో కనీసం రెండు అంశాల్లో ప్రత్యేకత చాటుకున్న చిత్రాలకు ఆస్కార్ బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేషన్ దక్కుతుంది. తరువాత వచ్చిన ఎంట్రీలలో ఈ నాలుగు అంశాలకు ఏ సినిమా ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది అన్న దానిపై ఓటింగ్ సాగుతుంది. అలా ఆస్కార్ అవార్డుల్లో అగ్రస్థానంలో నిలచిన ‘బెస్ట్ పిక్చర్’ ఎంపిక జరుగుతుంది. కాబట్టి, తమ చిత్రాలకు ఆస్కార్ నామినేషన్ ఆశించేవారు, ముఖ్యంగా బెస్ట్ పిక్చర్ కేటగిరీలో నామినేషన్ అందుకోవాలని భావించేవారు ఈ నాలుగు అంశాలకు ప్రాధాన్యమివ్వ వలసి ఉంటుంది.
ఒకప్పుడు ఆస్కార్ అవార్డులు అనగానే అమెరికా, బ్రిటిష్ సినిమాలకే ప్రాధాన్యముండేది. ఇప్పుడు జనరల్ కేటగిరీలో పోటీపడే అవకాశాలు అధికమయ్యాయి. కాబట్టి ఇతర దేశాలకు చెందిన చిత్రాలు సైతం ఇతర విభాగాల్లో పోటీపడవచ్చు. మన భారతీయులు ఈ అంశాలను అధ్యయనం చేసి, ఏదో ఒకరోజున ఆస్కార్ అవార్డుల్లో ‘బెస్ట్ పిక్చర్’ను అందిస్తారని ఆశించవచ్చు.