Off The Record: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 800కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సభకు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలా అనుకుంటుండగానే… వాళ్ళకో లోటు కనిపించిందట. నియోజకవర్గ కాంగ్రెస్‌లో కీలక నాయకురాలు ఇందిర ఈ కార్యక్రమలో ఎక్కడా ఎందుకు కనిపింలేదన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు.. ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కానీ… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం మీదే పోటీ చేసిన ఇందిర మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనిమీద రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి.
ఇక్కడ కడియం, ఇందిర వర్గాల మధ్య విభేదాలు ఏ మాత్రం పోలేదని ఈ మీటింగ్‌తో అర్దమవుతోందని అంటున్నారు కొందరు. మొదట్నుంచి పార్టీలో ఉన్న ఇందిర వర్గం పార్టీ మారిన వచ్చిన కడియం అండ్‌కో కలవలేకపోతోందట. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక అప్పటినుంచి వర్గ విభేదాలు మరింత పెరిగిపోయాయట. కడియం శ్రీహరి చేరిక సమయంలో ఇందిరకి కాంగ్రెస్ అధిష్టానం రక రకాల హామీలు ఇచ్చిందట. నామినేటెడ్ పదవులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామన్న హామీలేవి చాలా రోజులుగా అమలు కావడం లేదని, దీనికి తోడు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించి కనీస సమాచారం కూడా ఉండటం లేదని అసంతృప్తిగా ఉన్నారట ఆమె. అలాగే తనకు కార్పొరేషన్ ఛైర్మన్ ఇస్తామన్న హామీ కూడా అమలవలేదన్న బాధ ఉందట ఇందిరకు. చివరికి సీఎం సభ నిర్వహణకు సంబంధించి కూడా తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నది ఆమె అటెండ్ అవకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే మొక్కుబడి సమాచారం ఇచ్చి… సభకు రాకుండా కడియం ఎత్తుగడ వేశారన్నది లోకల్‌గా ఉన్న ఇంకో వెర్షన్. సీఎం సభకి ఒకరోజు ముందు ఇందిర తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపి… డుమ్మా నిర్ణయం తీసుకున్నారట. అలా చేయడం ద్వారా శ్రీహరి ఎత్తుగడల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నట్టు తెలిసింది. సుమారు 20 రోజుల నుంచి ఈ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు కడియం. కనీసం సీఎంని ఆహ్వానించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఏ దశలోనూ తనను పట్టించుకోలేదని ఆ వర్గం అసహనంగా ఉన్నట్టు తెలిసింది.
తాను సహకరిస్తేనే… కడియంను కాంగ్రెస్ లోకి తీసుకున్నారని, అలాంటిది ఇప్పుడు తన పేరు పలకడానికి కూడా ఆయనకు అంత నామోషీ ఎందుకని సన్నిహితులతో ఘాటుగానే అంటున్నారట ఇందిర. పదేళ్ళ నుంచి కష్ట కాలంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళని వదిలేసి… ఇప్పుడు కడియం శ్రీహరితో పార్టీ మారి వచ్చినవాళ్శకు నామినేటెడ్ పోస్ట్‌లు ఇస్తున్నారని, ఇప్పుడు సీఎం సభ విషయంలోనూ అవమానించరని, ఈ తొక్కేసే పాలిటిక్స్ పార్టీకి కూడా అంత మంచిది కాదని అంటోందట పాత కాంగ్రెస్ వర్గం. ఈ పాత కొత్త వివాదాన్ని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.