Naga Shourya Birthday: ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో యంగ్ హీరో నాగశౌర్య నటించేశాడు. వాటిలో కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకరింపచేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా కృషి చేస్తున్నాడో ‘లక్ష్య’ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆ తరువాత వచ్చిన నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సైతం ఆకట్టుకోలేక పోయింది. అయినా పట్టువదలని విక్రమార్కునిగా సాగుతున్న నాగశౌర్య ఈ యేడాది ఏకంగా మూడు చిత్రాలతో మురిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యనే అనూష శెట్టి అనే అందాల అమ్మాయి మెడలో మూడు ముడులూ వేశాడు నాగశౌర్య. ఆ అమ్మాయి అడుగు ఈ అబ్బాయిగారికి అచ్చివస్తుందనే అందరూ అంటున్నారు.
విజయవాడలో నాగశౌర్య బాల్యం గడిచింది. అప్పటి నుంచీ సినిమాలు అతణ్ణి ఆకర్షిస్తూనే ఉన్నాయి. టెన్నిస్ లో మంచి ప్రావీణ్యం ఉంది. మిత్రులు ఎప్పుడూ హీరోలా ఉన్నావ్ అంటూ ఉండేవారు. దాంతో సినిమాల్లో ట్రై చేయాలని భావించాడు నాగశౌర్య. అతడిని కన్నవారికి కూడా అది తెలుసు కాబట్టే, నాగశౌర్యను ప్రోత్సహించారు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ తో తెరపై తొలిసారి కనిపించిన నాగశౌర్య ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాడు. ‘చందమామ కథలు’లో రాజుగా పలకరించాడు. ‘ఊహలు గుసగుసలాడే’లో వెంకీగా అలరించాడు. ‘దిక్కులు చూడకు రామయ్యా’ అని హెచ్చరిస్తే, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అంటూ అవికా గోర్‌ను ఆహ్వానించాడు. ఇలా సాగుతున్న నాగశౌర్య ‘జాదూగాడు’గానూ మురిపించాడు. ఆ తరువాత ‘కళ్యాణ వైభోగమే’ అంటూ పాట పాడాడు.
నాగశౌర్య కన్నవారే తమ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ‘ఛలో’ సినిమా తీసి జనానికి అతణ్ణి మరింత చేరువ చేశారు. ‘నర్తనశాల, అశ్వత్థామ’ చిత్రాలు కూడా ఐరా బ్యానర్ పైనే తెరకెక్కి, నాగశౌర్య అభినయం చూసి ఔరా అనేలా చేశాయి. అయితే నాగశౌర్య ఆశిస్తున్న భారీ విజయం ఇప్పటి దాకా అతని దరి చేరలేదు. అయినా పట్టువదలక ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రాలలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఏది ఏమైనా ఏదో ఒకరోజు నాగశౌర్య కృషి ఫలిస్తుందని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సారి నాగశౌర్య చిత్రాలలో ఏదో ఒకటి జనాన్ని భలేగా అలరిస్తుందనీ చెబుతున్నారు. నాగశౌర్య కోరుకున్న సక్సెస్ ఆయన దరి చేరాలని ఆశిద్దాం.
(జనవరి 22న నాగశౌర్య పుట్టినరోజు)