(ఫిబ్రవరి 27న నటుడు సుబ్బరాజు పుట్టినరోజు)
క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. ఏ పాత్రయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయాలని తపిస్తాడు. నిజానికి కేరెక్టర్ యాక్టర్స్ అంతగా ఫిజిక్ పై శ్రద్ధ చూపించరనిపిస్తుంది. కానీ, సుబ్బరాజు తన తరం హీరోలకు దీటైన శరీరసౌష్టవంతో ఆకట్టుకుంటూ ఉంటాడు. అదీ సుబ్బరాజు స్పెషాలిటీ. ఆరంభంలో చిన్నాచితకా పాత్రలో సాగిన సుబ్బరాజుకు పూరి జగన్నాథ్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి.
సుబ్బరాజు 1977 ఫిబ్రవరి 27న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. సుబ్బరాజు మేథ్స్ లో డిగ్రీ పట్టా పొంది కంప్యూటర్ కోర్సు చేశాక, హైదరాబాద్ ‘డెల్’ కంప్యూటర్స్ లో కొంతకాలం పనిచేశారు. సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చిత్రంగానే జరిగింది. ‘డెల్’లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు వద్దకు వచ్చి, తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడయిందని, బాగు చేయమని కోరాడు. అలా కృష్ణవంశీ ఆఫీసుకు వెళ్ళిన సుబ్బరాజుకు అనుకోకుండా ‘ఖడ్గం’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం లభించింది. ఆ సినిమా తరువాత పూరి జగన్నాథ్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’లో హీరోతో బాక్సింగ్ రింగ్ లో తలపడే ప్రత్యర్థి పాత్ర పోషించారు. ఈ సినిమా సుబ్బరాజుకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. వరుసగా “శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ” చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆ తరువాత పలు అవకాశాలు సుబ్బరాజును పలకరించాయి. పూరి జగన్నాథ్ తరువాత హీరో రవితేజ కూడా సుబ్బరాజును బాగా ప్రోత్సహించారు. తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు సుబ్బరాజు. అలా అతి త్వరగా 50 సినిమాలు పూర్తి చేశారు. సుబ్బరాజు 50వ చిత్రంగా అల్లరి నరేశ్ ‘అహ నా పెళ్ళంట’ వచ్చింది.
గత సంవత్సరం బాలకృష్ణ ‘అఖండ’లో కీలక పాత్ర పోషించిన సుబ్బరాజు రాబోయే మహేశ్ చిత్రం ‘సర్కారువారి పాట’లోనూ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనున్నారు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ సుబ్బరాజు నటించి అలరించారు. ఈ పుట్టినరోజు తరువాత సుబ్బరాజు మరింత బిజీ అవుతారేమో చూడాలి.