(నవంబర్ 5న మెహ్రీన్ పుట్టినరోజు)
తెలుగు సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తొలిసారి నాయికగా తెరపై వెలిగింది మెహ్రీన్ పిర్జాదా. ఈ పంజాబీ ముద్దుగుమ్మ వచ్చీ రాగానే తెలుగువారిని ఆకట్టుకుంది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసింది. ఇప్పటికీ తెలుగు చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. ఆ మధ్య ‘ఎఫ్ -2’లో వరుణ్ తేజ్ జోడీగా అలరించిన మెహ్రీన్, ఆ సినిమా సీక్వెల్ గా వస్తోన్న ‘ఎఫ్-3’ లోనూ నటిస్తోంది. దీపావళి కానుకగా విడుదలవుతోన్న ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలో మెహ్రీన్ నాయికగా నటించింది. ఈ సినిమా విడుదలయిన మరుసటి రోజునే మెహ్రీన్ 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
మెహ్రీన్ పిర్జాదా 1995 నవంబర్ 5న పంజాబ్ లోని బతిండాలో జన్మించింది. సిక్కు కుటుంబంలో పుట్టిన మెహ్రీన్ ను కన్నవారు కూడా ఆమె ఏది కోరితే అది ఇచ్చి ప్రోత్సహించారు. పదేళ్ళ వయసులోనే మెహ్రీన్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. టొరొంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఏసియా కెనడా 2013 పోటీలో విజేతగా నిలచింది మెహ్రీన్. ఆమె సినిమాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దృష్టిని ఆమె ఆకర్షించారు. అలా నాని హీరోగా రూపొందిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంలో నాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది మెహ్రీన్. ఆ సినిమా విజయంతో తెలుగులో “మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, నోటా, కవచం, ఎఫ్-2, చాణక్య, ఎంతమంచి వాడవురా, అశ్వథ్థామ” చిత్రాలలో మెహ్రీన్ మురిపించింది. ఈ చిత్రాలలో ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్-2’ రెండూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలకు అనిల్ రావిపూడి దర్శకుడు కావడం విశేషం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్-3’లో మెహ్రీన్ నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న జనం ముందుకు రానుంది.
మెహ్రీన్ కు ఈ యేడాది మార్చి నెలలో భవ్య బిష్ణోయ్ అనే అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ప్యాండమిక్ కారణంగా మెహ్రీన్-బిష్ణోయ్ వివాహం వాయిదా పడింది. తరువాత ఎందువల్లో వారిద్దరూ తమ వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. కారణాలయితే తెలియదు కానీ, ఆ నిశ్చితార్థం రద్దు కాగానే, మెహ్రీన్ మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని తపిస్తోంది. అందులో భాగంగానే ఏ సినిమాలో నటించడానికైనా ఓకే అంటోంది. రాబోయే ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఎఫ్-3’ చిత్రాల్లో ఏది జనానికి నచ్చినా, మళ్ళీ మెహ్రీన్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.