కరోనా టైమ్ లో గతేడాది ‘డర్టీ హరి’తో సక్సెస్ చవిచూసిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘7డేస్ 6నైట్స్’. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు.
మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషా సినిమాలతో పాటు ఎపిక్ సినిమాలు చూస్తా. ఆ సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలా స్ట్రాంగ్ క్యారెక్టర్లతో సినిమా తీయాలనుకున్నాను. కరోనా కాలంలో ‘డర్టీ హరి’ తర్వాత కొన్ని కథలు అనుకున్నా. అప్పుడు రాజ్ కపూర్ ‘బర్సాత్’ చూశా. అందులో రెండు పాత్రలు బాగా నచ్చాయి. ఒకడు అతి మంచోడు. వాడికి ఎప్పుడూ ఏదో ఇబ్బంది ఉంటుంది. హీరో ఎప్పుడూ డేంజర్ లో ఉంటాడు. ఈ క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశా. అదే ఈ’7డేస్ 6నైట్స్’ అంటున్నారు ఎం.ఎస్.రాజు. ఇక ‘బర్సాత్’లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలో సుమంత్ పాత్ర ఉంటుంది. తనను గడ్డం పెంచి, బరువు పెరగమని చెప్పా. పెరిగాడు. అలాగే ‘బర్సాత్’లో రాజ్ కపూర్ ఫ్రెండ్ రోల్ ప్రేమనాథ్ చేశారు. మా సినిమాలో అటువంటి రోల్ లో రోహన్ నటించాడు. కథ, నేపథ్యాలు మాత్రం వేరు వేరుగా ఉంటాయి. యూత్‌ఫుల్ సినిమా కావటంతో ఒక్కడినే గోవా వెళ్ళాను. ఇంట్లో కూడా చెప్పలేదు. రాజమండ్రి వెళుతున్నానని చెప్పా. గోవా వెళ్ళాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. నిర్మాతగా విజయాలు సాధించినా దర్శకుడిగా విజయాలు అందుకోలేదు. అందుకే పట్టుదలతో ‘7 డేస్ 6 నైట్స్’ కథ రాశా. గోవాలో యువత తిరిగే ప్రదేశాలలో తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది గమనించా అని చెప్పుకొచ్చారు రాజు.
ఈ సినిమాను ముందు తక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నా ట్రైలర్ విడుదల చేశాక థియేటర్ల సంఖ్య పెరుగుతోందని, ‘7 డేస్ 6 నైట్స్’ అంటే అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదని, ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉందని అన్నారు దర్శకుడు ఎం.ఎస్.రాజు. ప్రస్తుతం థియేటర్లకు ముందు వచ్చేది యువతరమే. అయితే ఇది ఫ్యామిలీ సినిమా కూడా. అడల్ట్ కంటెంట్ సినిమా కాదు. సెన్సార్ కూడా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది అని అంటున్నారు. దీని తర్వాత రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో ‘సతి’ సినిమా తీస్తున్నా. అలాగే నా సినిమాల్లో ఓ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నా. దాన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్ లో ఆరంభం అవుతుంది. భారీ స్కేల్ లో ఉంటుందని తెలిపారు ఎం.ఎస్.రాజు.