బుల్లితెర వీక్షకుల కోసం యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలను, షోస్ ను నిర్వహించాడు. తాజా ఈ క్రేజీ అండ్ పాపురల్ యాంకర్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అందుకు ఆహా వేదిక కానుండటం విశేషం. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓంకార్ ‘డాన్స్ ఐకాన్’ అనే డాన్స్ షోకు శ్రీకారం చుట్టబోతున్నాడు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”ఆహా, ఓక్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సమర్పిస్తున్న కార్యక్రమం ‘డాన్స్ ఐకాన్’.
దీని ద్వారా నేను ఓటీటీలోకి అడుగుపడుతున్నాను. జూన్ 22 నుండి ప్రారంభం కానున్న ఈ షో డిజిటల్ ఆడిషన్స్ జూలై 10 వరకూ కొనసాగుతాయి. 5 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో పాల్గొనవచ్చు. 60 సెకన్ల నిడివి ఉన్న డాన్స్ వీడియోను మా మెయిల్ అడ్రస్ కు పంపితే చాలు. నేను గతంలో ఎన్నో డాన్స్ షోస్ చేశాను. అయితే ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనే వారు, వారికి కొరియోగ్రఫీ సమర్పించే వారి జీవితాలను కూడా ఈ షో మార్చేస్తుంది. గెలిచిన డాన్సర్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లోని టాప్ హీరో మూవీకి వర్క్ చేసే ఛాన్స్ దక్కుతుంది” అని అన్నారు. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆహా సంస్థ ఇప్పుడు ఓటీటీలో డాన్స్ రియాలిటీ షోనూ ప్రారంభించనుండటం విశేషం.