తెలుగు సినిమా ఇప్పుడు తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనే స్థాయిని దక్షిణాది సినిమా పూర్తిగా ఆక్రమించేసింది. దానికి అనుగుణంగా దక్షిణాది సినిమాలకు, తారలకు, దర్శకులకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ పెరుగుడు అసలు నిర్మాత మనుగడకే ప్రమాదం తీసుకురానుందా!? అంటే యస్ అనే వినిపిస్తుంది. సినిమాకు సంబంధించి రాబడి అంటే ఒకప్పుడు కేవలం థియేట్రికల్ కలెక్షనే. రాను రాను ఆదాయ మార్గాలు పెరిగాయి. ఆడియో, వీడియో, డబ్బింగ్, డిజిటల్, ఓవర్సీస్, ఓటీటీ అంటూ పలు రకాలుగా ఆదాయం రావటం మొదలైంది. ఈ పరిణామంతో లాభపడుతోంది ఎవరంటే ఖచ్చితంగా నిర్మాత కాదనే చెప్పాల్సి వస్తోంది. మహా మహా నిర్మాణ సంస్థలు కనుమరుగయ్యాయి. కాంబినేషన్స్ సెట్ చేసేవారిదే రాజ్యంగా మారింది. నిర్మాత కేవలం పెట్టుబడిదారుగానే మిగిలిపోయాడు. వ్యవహారం అంతా హీరోలు, దర్శకులదే.
కరోనాకు ముందు తర్వాత…
కరోనాకు ముందు సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని, ఎట్టి పరిస్థితుల్లో పెరగకుండా అరికట్టాలని నిర్మాతలు వాపోయేవారు. కరోనా సమయంలో అందరూ ఖాళీగా ఉన్నపుడు పరిస్థితులు చక్కబడితే వాస్తవాలు గుర్తెరిగి నిర్మాణ వ్యయం తగ్గించుకుంటారనే భావన అందరిలోనూ కలిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నిర్మాణ వ్యయం తగ్గటం అటుంచి అనేక రెట్లు పెరిగి పోయింది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి తెలుగు సినిమాకు అమాంతం గుర్తింపు పెరగటం… ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరిగి ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు రూపొందటం. దీంతో నటీనటులు, సాంకేతిక నిపుణుల కొరత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవరిని కదిలించినా ఖాళీగా లేమనే సమాధానం వినవస్తోంది. కరోనాకు ముందు రోజుకు లక్ష తీసుకునే నటీనటులు ఆ తర్వాత రెండు మూడు లక్షలు వసూలు చేస్తున్నారు. గతంలో ఓ సినిమాకు 5 కోట్లు తీసుకునే మీడియమ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ‘పదిహేను కోట్లు ఇవ్వాల్సిందే’ అంటున్నారు. అంతే కాదు కథ నుంచి దర్శకుల వరకూ అన్నింటిలోనూ వేలు పెట్టడమే. ఇక స్టార్ హీరోలు, డైరెక్టర్స్ మాట సరేసరి… వారు ఆడిందే ఆట… పాడిందే పాట…
నిజంగా లాభాలు వస్తున్నాయా!?
కరోనా తర్వాత వచ్చిన సినిమాలు వసూళ్ళ వర్షం కురిపిస్తున్నాయా? అంటే అదేం లేదనే సమాధానం వినవస్తుంది. చిన్న సినిమాలలో ‘ఉప్పెన, జాతిరత్నాలు, యస్. ఆర్. కళ్యాణమండపం, డి. జె. టిల్లు’ వంటి కొన్ని వేళ్ళమీద లెక్కపెట్టగలిగేవే లాభాలు తెచ్చిపెట్టిన లిస్ట్ లో ఉంటాయి. ఇక బడా సినిమాల్లో ఒక్క ‘అఖండ’కు తప్ప ఏ సినిమాకు అన్ని వర్గాల వారికి లాభం వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… సినిమాలకు మంచి వసూళ్ళు రాలేదా? అంటే వచ్చాయి. కానీ ఆ యా సినిమాలకు అయిన ఖర్చు… అమ్మిన రేట్లుతో పోల్చితే నష్టమే. ఇక్కడ అన్ని విధాలుగా లాభపడింది ఎవరయ్యా అంటే నిస్సందేహంగా నటీనటులు, సాంకేతిక నిపుణులే. నష్టపోయింది మెజారిటీ నిర్మాతలు, పంపిణీదారులు, ఎం.జి.లు పెట్టి సినిమాలు కొన్న ప్రదర్శనదారులు అని చెప్పవలసి ఉంటుంది.
నిర్మాణ వ్యయం ఎందుకు పెరుగుతోంది!?
సినిమాల నిర్మాణ వ్యయం ఎందుకు పెరుగుతోందంటే… మెజారిటీ ఖర్చు పారితోషికాలకే వెళుతోంది. డిమాండ్ అండ్ సప్లయ్ మీద ఆధారపడి ముందుకు వెళుతున్న ఇండస్ట్రీ మనది. ముందు చెప్పినట్లు ఓటీటీల రాకతో పాటు ఆదాయ మార్గాలు పెరగటంతో నటీనటులకు, ప్రధాన సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరిగింది. దాంతో వారు పారితోషికాలను అమాంతం పెంచేశారు. గుర్తింపు ఉన్న హీరోలు సరేసరి ఏకంగా మూడు రెట్లు పెంచేశారు. వరుస ప్లాఫ్ లు పలకరిస్తున్న ఏ ఒక్క హీరో ఖాళీగా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక రన్నింగ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థలు కొన్ని చిన్నా, పెద్దా హీరోలను అధికమొత్తలు ఇచ్చి బ్లాక్ చేసేస్తున్నాయి. ఎందుకంటే ఆ సంస్థల నిర్మాణ ప్రయాణం ఆగకూడదు. ఆగితే లొసుగులు అన్నీ బయటపడతాయి కాబట్టి.
తగ్గే మార్గం లేదా?
మరి నిర్మాణ వ్యయం తగ్గే మార్గం లేదా? అంటే… ఉంది. కానీ పాటించే వారు ఎవరు? గతంలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్., కృష్ణ, శోభన్ బాబు వంటి వారు ఠంచనుగా 7 గంటల కాల్షీట్ అంటే 6 గంటలకే లొకేషన్ లో ఉండేవారు. దాంతో సినిమా మొత్తం అనుకున్న టైమ్ లోనే పూర్తయ్యేది. సాంకేతికత పెరిగిన ప్రస్తుత కాలంలో మాత్రం హీరోలు వచ్చేదే ఆలస్యంగా… ఆ తర్వాత కార్ వాన్ నుంచి బయటకు రావటానికి మరి కొంత టైమ్. షాట్ రెడీ అని ధైర్యంగా చెప్పగలిగే నిర్మాతలు, దర్శకులు ఎవరున్నారు? అందుకే ఒక్కో సినిమాకి వందలాది రోజుల షూటింగ్. వ్యయం పెరగక ఏమవుతుంది!? కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నా… అన్నం పెట్టే నిర్మాతలన్నా లెక్కలేకపోవడానికి మన హీరోలకు ఉన్న డిమాండే. ముందు వీరి మైండ్ సెట్ మారాలి. ఆ తర్వాత కెప్టెన్ ఆఫ్ ది షిప్ కి క్లారిటీ ఉండాలి. తీయదలచుకున్న ప్రతి షాట్ మైండ్ లోనూ, పేపర్ పైనా ఉండాలి. ఇది ఎంత మందిలో ఉంది! ఈ కాలంలో ఎంత మంది నిర్మాతలకు ఆ రోజు తీస్తున్న సినిమా సీన్స్ గురించి తెలుసు? వీరందరిలో మార్పు రావాలి. అంతే కాదు స్టార్ సినిమాలనగానే ఎగబడి కొనే పంపిణీదారులు, ఇతర కొనుగోలు దారుల మైండ్ సెట్ మారాలి. అప్పుడే వ్యయం తగ్గుతుంది. నిజంగా ఇది జరుగుతుందా!? అంటే హోప్ సో…