అమెరికన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు సి.సి.ఏ, డి.జి.,ఏ, హెచ్ ఎఫ్.పి.ఏ, యన్.బి.ఆర్, పి.జి.ఏ, ఎస్.ఏ.జి వంటి సినిమా సంబంధిత సంస్థలు ప్రతీసారి అకాడమీ అవార్డ్స్ పై తమ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంస్థలు ఎంపిక చేసిన చిత్రాలకే ఆస్కార్ అవార్డ్స్ లోనూ ప్రాధాన్యత ఉంటుంది. ఆస్కార్ అవార్డ్స్ లో 23 విభాగాలు ఉన్నప్పటికీ, అన్నిటి కన్నా మిన్నగా ఉత్తమ చిత్రం
ఏది అన్నదానిపైనే ఆసక్తి అధికంగా నెలకొంటుంది. దేశవిదేశాల్లో ఈ సారి ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఆస్కార్ అవార్డు సంపాదిస్తుందోనని ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి ప్రతి యేడాది ఫిబ్రవరిలో చివరలో కానీ, మార్చి ఆరంభంలో కానీ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సాగుతూ ఉంటుంది. కానీ, ఈ సారి మార్చి 27న ఆదివారం 94వ ఆస్కార్ అవార్డుల వేడుక సాగనుంది.
అమెరికన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ సంస్థలతో పాటు పలు సినిమాలకు అవార్డుల ప్రకటించే సంస్థల ప్రకారం ఈ సారి ఏ యే చిత్రాలు నామినేషన్ పొందాయి అన్న విషయం ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ట్రేసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఈ ప్రకటన చేయబోతున్నారు.
ఈ సారి ఉత్తమ చిత్రం విభాగంలో బెల్ పాస్ట్, కోడా, డోంట్ లుకప్, డ్యూన్, కింగ్ రిచర్డ్, ద లాస్ట్ డాటర్, నో టైమ్ టు డై, ద పవర్ ఆఫ్ ద డాగ్, టిక్ టిక్...బూమ్, వెస్ట్ సైడ్ స్టోరీ
వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి. వీటిలో ఎ.ఎఫ్.ఐ, బి,ఏ.ఎఫ్,టి.ఏ సంస్థలు, ఇతర సంస్థలు అందించిన అవార్డులను బట్టి, కోడా, ద లాస్ట్ డాటర్, కింగ్ రిచర్డ్, ద పవర్ ఆఫ్ ద డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ
చిత్రాలు 90 శాతానికి పైగా పాయింట్లు పోగేశాయి. అయితే వీటితో పాటు బెల్ ఫాస్ట్
పేరు కూడా నామినేషన్ దక్కించుకుంటుందని వినిపిస్తోంది. ఉత్తమ చిత్రం తరువాత అకాడమీ అవార్డుల్లో ఎంతో క్రేజ్ ఉన్న విభాగం బెస్ట్ డైరెక్టర్. ఈ సారి ఈ కేటగిరీలో స్టీవెన్ స్పీల్ బెర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), పాల్ థామస్ ఆండర్సన్ (లికోరైస్ పిజ్జా), రైసుకే హమగుచి (డ్రైవ్ మై కార్), డెనిస్ విల్లెనువే (డ్యూన్), జేన్ క్యాంపియన్ (ద పవర్ ఆఫ్ ద డాగ్) పోటీ పడుతున్నారు.
బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరీలో – కింగ్ రిచర్డ్ లో నటించిన విల్ స్మిత్, రెడ్ రాకెట్ లో నటించిన సైమన్ రెక్స్ తో పాటు బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ (ద పవర్ ఆఫ్ ద డాగ్), డెంజెల్ వాషింగ్టన్ (ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్ బెత్), ఆండ్రూ గ్యార్ ఫీల్డ్ (టిక్ టిక్…బూమ్) పోటీలో ఉన్నారు. ఇక బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరీలో నికోల్ కిడ్మన్ (బీయింగ్ ద రికార్డోస్), లేడీ గాగ (హౌస్ ఆఫ్ గుకై), జెన్నీఫర్ హడ్సన్ (రెస్పెక్ట్), జెస్సికా చస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ ట్యామీ ఫేయ్), ఒలివియా కాల్మన్ (ద లాస్ట్ డాటర్) పోటీపడుతున్నారు. సపోర్టింగ్ రోల్ లో యాక్టర్స్ విభాగంలో ట్రాయ్ కాట్సుర్ (కోడా), బ్రాడ్లే కూపర్ (లికోరైస్ పిజ్జా), సియారన్ హిండ్స్ (బెల్ ఫాస్ట్), కోడీ స్మిత్ మెక్ పీ (ద పవర్ ఆఫ్ ద డాగ్), జరేడ్ లిటో (హౌస్ ఆఫ్ గుకై) నామినేషన్ కోసం తపిస్తున్నారు. సపోర్టింగ్ రోల్ లో పోటీ పడుతున్న నటీమణులెవరంటే – అరియానా డి బోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ), మార్లీ మాట్లిన్ (కోడా), కైట్రియోన్ బాల్ఫే (బెల్ ఫాస్ట్), కిర్స్టెన్ డన్ట్స్ (ద పవర్ ఆఫ్ ద డాగ్), రూత్ నెగ్గా (పాసింగ్).
బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో – డ్యూన్, బెల్ ఫాస్ట్, ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్బెత్, ద పవర్ ఆఫ్ ద డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీస్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేసినవారికి నామినేషన్ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ అవార్డు నామినేషన్ కోసం క్రుయెల్లా, సైరానో, డ్యూన్, నైట్ మేర్ అలే, హౌస్ ఆఫ్ గుకై
చిత్రాలకు పనిచేసిన వారు పోటీలో ఉన్నారు.
బెస్ట్ ఇంటర్నేషనల్ పీచర్ ఫిలిమ్ విభాగంలో ఫ్లీ, ద హీరో, ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ద వరస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, డ్రైవ్ మై కార్
చిత్రాలకు నామినేషన్ దక్కే అవకాశం ఉంది. మన దేశం నుండి ఈ విభాగంలో తమిళ సినిమా పెబుల్స్
ను అధికార ఎంట్రీగా పంపారు. కానీ, ఇప్పటికే ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. డోంట్ లుక్ ఆప్, డ్యూన్, నో టైమ్ టు డై, ద పవర్ ఆఫ్ ద డాగ్, టిక్ టిక్ ...బూమ్
చిత్రాలు మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) విభాగంలో నామినేషన్స్ కోసం వేచి ఉన్నాయి. ఇక బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) కేటగిరీలో బెల్ ఫాస్ట్
లోని డౌన్ టు జాయ్...
, డోంట్ లుక్ అప్
లోని జస్ట్ లుక్ అప్...
, ఎంకాటో
లోని డాస్ ఒరుగ్విటాస్...
, ద హార్డర్ దే ఫాల్
లోని గన్స్ గో బ్యాంగ్...
, నో టైమ్ టు డై
లోని నో టైమ్ టు డై...
సాంగ్స్ నామినేషన్ సంపాదించే అవకాశం ఉంది.
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో డ్యూన్, ఇటెర్నల్స్, స్పైడర్ మేన్ :నఓ వే హోమ్, ద మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్, షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్
చిత్రాలు నామినేషన్ కోసం పోటీ పడుతున్నాయి. రచనా విభాగంలో ద లాస్ట్ డాటర్, డ్యూన్, కోడా, ద పవర్ ఆఫ్ ద డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ
చిత్రాలకు పనిచేసిన రచయితలు అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కోసం పోటీలో ఉన్నారు. ఇక ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో బీయింగ్ ద రికార్డోస్, కమాన్ కమాన్, బెల్ ఫాస్ట్, లికో రైస్ పిజ్జా, డోంట్ లుక్ అప్
సినిమాల రైటర్స్ పోటీ పడుతున్నారు.
ఫిబ్రవరి 8న ఏ యే విభాగాల్లో ఏ సినిమాలు ఏ యే విభాగాల్లో పోటీ పడుతున్నాయో ప్రకటిస్తారు. తరువాత మార్చి 7న నామినేషన్స్ లాంచియన్
సాగుతుంది. ఇందులో నామినేషన్స్ పొందిన విభాగాల్లోని వారందరూ పాల్గొంటారు. మార్చి 17న ఫైనల్ వోటింగ్ మొదలవుతుంది. మార్చి 22న వోటింగ్ పూర్తవుతుంది. మార్చి 27 ఆదివారం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సాగనుంది. మన దేశంలో మార్చి 28 సోమవారం వేకువన ఈ ఉత్సవాన్ని చూడవచ్చు.