Katragadda Murari: యువచిత్ర అధినేత కాట్రగడ్డ మురారి సినిమాలు అనగానే వాటిలోని సంగీత సాహిత్యాలు ముందుగా గుర్తుకు వస్తాయి. చిన్నప్పటి నుంచీ సాహిత్యమంటేనే మురారికి మక్కువ ఎక్కువ. చదువులో ఎంతోతెలివైన వారు అయినా, మధ్యలోనే డాక్టర్ చదువును ఆపేసి సినిమా రంగంవైపు అడుగులు వేశారు. అక్కడే సంగీత బ్రహ్మగా పేరొందిన కె.వి.మహదేవన్, ఆయన సహాయక సంగీత దర్శకుడు పుహళేందితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి ద్వారానే మురారి సైతం సంగీతంలో కొంత పట్టు సాధించగలిగారు. ఏ సమయంలో ఏ రాగం ఆలపించాలి, ఏ రాగంలోని మాధుర్యం సంధర్భానికి ఏ తీరున సరితూగుతుంది వంటి అంశాలలోమురారికి కాసింత పరిజ్ఞానం రావడానికి పుహళేంది కారణమని చెప్పవచ్చు. తాను యువ చిత్ర పతాకం నెలకొల్పి తొలి ప్రయత్నంగా `సీతామాలక్ష్మి` తెరకెక్కించే సమయంలో కేవీ మహదేవన్ నే ఆశ్రయించారు. ఆ సినిమాకు దర్శకులు కె.విశ్వనాథ్ సూచనల మేరకు కేవీ మహదేవన్ పలికించిన బాణీలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అది మొదలు తన పతాకంపై నిర్మించిన చివరి చిత్రం `నారీ నారీ నడుమ మురారి` దాకా కేవీ మహదేవన్ స్వరకల్పనతోనే సాగారు మురారి. `మామ` మహదేవన్ లేకపోవడంతో యువచిత్ర పతాకంపై చిత్రాలనే నిర్మించలేదు మురారి. అంతలా మహదేవన్ ను అభిమానించారు, ఆరాధించారు మురారి. ఓ సందర్భంలో ఓ దర్శకుడు తనకు చక్రవర్తి బాణీలు బాగా అచ్చివస్తున్నాయని, ఆయనను సంగీతదర్శకునిగా పెట్టుకుందామని సూచించినా, అవసరమైతే సినిమానే తీయను కానీ, `మామ`తో కాకుండా మరో సంగీత దర్శకునితో `యువచిత్ర` సినిమా ఉండదనీ కరాఖండిగా చెప్పిన మహదేవన్ వీరాభిమాని మురారి.
మురారి ప్రతి చిత్రమూ పాటల పందరిలాగే ఉంటుంది. అందుకు ఆయన తొలి చిత్రం `సీతామాలక్ష్మి` బీజం వేసింది. ఆ సినిమాను లోతుగా పరిశీలిస్తే, యన్టీఆర్, భానుమతితో బి.యన్.రెడ్డి తెరకెక్కించిన కళాఖండం `మల్లీశ్వరి` గుర్తుకు రాకమానదు. తెలుగు చిత్రసీమలో `మల్లీశ్వరి` ఓ పాటల పందిరిగా నిలచింది. అదే తీరున తానూ తన చిత్రాల ద్వారా పాటల పందిళ్ళు వేయాలనే మురారి తపన. ఆయన అభిలాషకు తగ్గట్టుగానే దర్శకులు, సంగీత దర్శకుడు లభించారు. `సీతామాలక్ష్మి`లో “మావి చిగురు తినగానే కోవిల పలికేనా… కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా…“ అంటూ సాగే పాటలోని కృష్ణశాస్త్రి భావుకతను మామ తన బాణీల్లో ఒదిగిన రీతిని ఏ సంగీత ప్రియుడు మాత్రం మరచిపోగలడు? అదే చిత్రంలోని ~“కొక్కొరొక్కో..,.“ పాటయినా, “పదే పదే పాడుతున్నా… పాడిన పాటే…“, “ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను…“ ఇలా ఎటు చూసినా పాటలతోనే `సీతాలు సింగారాన్ని` మన ముందు ఉంచి మదిని దోచారు మురారి.
read also: Vaishnav Tej: మావయ్యను ఫాలో అవుతూ.. తొలి ఫిలింఫేర్ అవార్డు చూసి మురిసిపోతూ…
మురారి అభిరుచికి అనువుగానే దాసరి నారాయణరావు సైతం తనదైన బాణీ పలికించారు. దాసరి దర్శకత్వంలో మురారి తెరకెక్కించిన “గోరింటాకు, అభిమన్యుడు“ రెండింటా శోభన్ బాబు హీరో కావడం విశేషం! `గోరింటాకు` మురారి రెండో సినిమానే అయినా, ఆ చిత్రంతోనూ పాటల పందిరి వేశారు. ఇందులోనూ దేవులపల్లి కృష్ణశాస్త్రితో తన అభిరుచికి తగ్గ పాటలు రాయించుకున్నారు మురారి. “గోరింటా పూచింది కొమ్మాలేకుండా…“ అంటూ సాగే పాటయినా,“ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం…“ అనే గీతంలోనూ కృష్ణశాస్త్రి పలుకులు చిలికిన తేనెలు తెలుగువారికే సొంతం చేశారు మురారి. ఇందులోనే వేటూరి రాసిన “కొమ్మకొమ్మకో సన్నాయి… కోటి రాగాలు ఉన్నాయి…“ పాట తరువాతి రోజుల్లో వేటూరి వ్యాససంపుటికి మకుటంగానూ నిలచింది. ఇక `జేగంటలు`లో “ఇది ఆమని సాగే చైత్రరథం…“ అంటూ ఆమనిని వదల్లేదు. ఆ పై “వలపుల హరిచందనాలకు“ వందనం చేసిన వేటూరి నేర్పరి తనానికీ మురారి అభిరుచికి భలేగా లంకె కుదిరింది. `త్రిశూలం` చిత్రంలో “వెలుగుకు ఉదయం…“, “రాయిని ఆడది చేసిన రాముడివా… గంగను తలపై మోసే శివుడివా…“ పాటల్లోని భావం సైతం తెలుగు ప్రేక్షకలోకాన్ని పరవశింపచేసింది. `జానకి రాముడు` తాను పనిచేసిన `మూగమనసులు`కు నఖలుగానే తీర్చిదిద్దినా, అందులోనూ పాటలకు పెద్ద పీటవేశారు మురారి. ఈ రెండు చిత్రాలకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం! రెండింటిలోనూ దర్శకేంద్రుని మార్కు కన్నా, మురారి అభిరుచే ఎక్కువగా కనిపిస్తుంది. `జానకి రాముడు`లోని “నా గొంతు శ్రుతిలోన…“, “చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల…“ పాటల్లోనూ మురారి భావుకత్వం ఇట్టే మనలను పలకరిస్తుంది. `శ్రీనివాస కళ్యాణం`లోనూ “ఎందాక ఎగిరేవమ్మా గోరింకా…“, “తుమ్మెదా తుమ్మెదా…“ పాటల్లోనూ మురారి అభిరుచి మనలను పలకరించక మానదు.
Read also: Power Star: ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’కు పవన్ కళ్యాణ్!?
నందమూరి బాలకృష్ణతో మురారి రెండు చిత్రాలు నిర్మించారు. ఆ రెండూ పాటల పందిళ్లుగా నిలవడం విశేషం! జంధ్యాల దర్శకత్వంలోరూపొందిన `సీతారామకళ్యాణం`లోని ప్రతి పాటా ఆణిముత్యమే! ఈ సినిమా సమయంలో మురారి అభిమానులకు ఓ పరీక్ష కూడా పెట్టారు. `సీతారామకళ్యాణం` చిత్రం కోసం తొలుత ఆరు పాటలు రాయించారు. వాటిలో ఏది బాగోలేదో చెబితే దాని స్థానంలో మరో పాటను రూపొందిస్తామనీ మురారి ప్రకటించారు. ఆ చిత్రం కోసం ఆరుద్రతో రెండు పాటలు రాయించారు. వాటిలో “పసుపు కెంపు ఆకుపచ్చ నారింజ, నీలాంబరి నేరేడు గురువింద…“ పాట చిత్రంలో చోటు సంపాదించింది. కాగా, ఆరుద్ర కలం నుండే జాలువారిన “ముద్దు… వద్దు… అయితే స్నేహం రద్దు…“ అనే పాటను అభిమానులు అంతగా ఇష్టపడలేదు. దాంతో వేటూరితో అదే సందర్భానికి తగ్గ “ఏమని పాడను…“ అనే పాటను రాయించారు. దానినే చిత్రీకరించారు. ఇందులోని టైటిల్ సాంగ్ అదరహో అనిపిస్తే, దానిని మించిన తీరున “రాళ్ళల్లోఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు…“ పాట మురిపించింది. ఇక మురారి చివరి చిత్రంగా విడుదలైన `నారీ నారీ నడుమ మురారి`లోనూ బాలకృష్ణనే హీరో. ఆ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి వంటి మాస్ డైరెక్టర్ ను, బాలయ్య లాంటి మాస్ హీరోను పెట్టుకున్నా, ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమాను తన అభిరుచి మేరకే నిర్మించారు మురారి. ఇందులోని “ఇరువురి భామల కౌగిలిలో…“ పాటయినా, “వయసూ సొగసూ కలిసిన వేళ…“ అన్నపాటలోనూ ఆయన టేస్టే ఏంటో తెలిసి పోతుంది. ఈ రెండు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గానే కాదు, బాక్సాఫీస్ హిట్స్ గానూ నిలవడం విశేషం!
మురారి తన చిత్రాలలో సంప్రదాయ గీతాలను సైతం చిత్రాలకు అనువుగా మలిపించిన సందర్భాలున్నాయి. `సీతారామకళ్యాణం`లో త్యాగరాజ కృతి “ఎంత నేర్చినా…“ను తన సంద్భానికి తగిన రీతిలో రాయించుకున్నారు. అలాగే `నారీ నారీ నడుమ మురారి`లోనూ త్యాగరాజ కృతి “మనసులోని మర్మమును తెలుసుకో…“ను సినిమాకు తగ్గ విధంగా మలిపించుకున్నారు. ఇక మురారి చిత్రాల్లో పరాజయాన్ని చవిచూసిన సినిమాలుగా `జేగంటలు,అభిమన్యుడు` నిలిచాయి. ఆ రెండింటిలో `జేగంటలు` సంగీత సాహిత్యాలతోఅలరించింది. కానీ, `అభిమన్యుడు` ఏదోఒక పాట మినహా ఏ విధంగానూ మురిపించలేదు. మురారి చిత్రాల కోసం దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర, వేటూరి, సీతారామశాస్త్రి వంటివారు పాటలు పలికించినా, ఆయనకు అత్యంత ఇష్టుడైన గీత రచయిత ఆచార్య ఆత్రేయ అనే చెప్పాలి. ఒక్క `జేగంటలు` మినహాయిస్తే (అది కూడా యువచిత్ర పతాకంపై నిర్మితమైనది కాదు) ఇక తన బ్యానర్ లోతెరకెక్కిన అన్ని చిత్రాలలోనూ ఆత్రేయ పాటలతో సాగారు మురారి. వారిద్దరి మధ్య నిర్మాత, రచయిత అనుబంధం కన్నా, ఆత్మీయ బంధం ఉండేది. అందువల్ల ఇద్దరూ తిట్టుకొని, కొట్టుకొని పోట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. అయినా, అదంతా పాటల కోసం పడ్డ పాట్లు అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉదహరించిన పాటలే కాదు, మురారి చిత్రాలలోమ్యూజికల్ హిట్స్ గా నిలచిన సినిమాల్లోని పాటలు మనం ఒక్కసారి వింటే చాలు మనలను వెంటాడుతూనే ఉంటాయి.
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రపై మీకెందుకంత ద్వేషం?