టాలీవుడ్లో ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా మొదలవడానికి మెగాస్టార్ చిరంజీవి చిత్రం కారణంగా బ్రేకులు పడ్డాయి. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. వాస్తవానికి, వెంకటేష్ తన పాత్రను కేవలం పది రోజుల్లో ముగించి త్రివిక్రమ్ సినిమాలోకి అడుగుపెడతారని అంతా భావించారు. కానీ, అనుకున్నదానికి విరుద్ధంగా షూటింగ్ వ్యవధి పెరిగింది. ఇప్పటికే ఇరవై రోజులు దాటినా వెంకీ పాత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా కోసం వెంకీ ఏకంగా నాన్‌స్టాప్‌గా 30 రోజులపాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది. ఈ కారణంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను వాయిదా వేయక తప్పలేదు.
Also Read:Ramanaidu Studios : GHMC నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్?
‘మన శంకర వరప్రసాద్‌గారు’లో వెంకటేష్ పాత్ర నిడివిపై కూడా తాజా సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో వెంకీ దాదాపు 30 నిమిషాలపాటు తెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. పాత్ర నిడివి ఎక్కువగా ఉండటం వల్లే షూటింగ్ ఆలస్యం అవుతోందని సమాచారం. వెంకటేష్, చిరంజీవి కలిసి పాల్గొనే ముఖ్యమైన ఘట్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి. డిసెంబర్ మొదటి వారంలో చిరంజీవి, వెంకటేష్‌లపై ఓ పాటను చిత్రీకరించేందుకు అనిల్ రావిపూడి బృందం సన్నాహాలు చేస్తోంది. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాతే వెంకీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతారు. తాజా షెడ్యూల్ ప్రకారం, డిసెంబర్ మొదటి వారంలో సాంగ్ షూటింగ్ పూర్తయిన తర్వాత, వెంకటేష్ డిసెంబర్ 15 నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.