క్యాన్సర్… ఒక ‘డెడ్’ ఎండ్ లాంటిది! కానీ, మనిషి పట్టుదల ముందు క్యాన్సర్ కూడా తల వంచుతుందని సోనాలి బెంద్రే, తాహిర్ కశ్యప్ చెబుతున్నారు. వారిద్దరూ క్యాన్సర్ ను జయించిన ధీర వనితలే. సోనాలికి 2018లో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఆమె న్యూయార్క్ లో కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ సమయంలో తాను ఎలా విధి రాతని ఎదుర్కొందో ‘క్యాన్సర్ సర్వైవర్స్ డే’ సందర్భంగా సొషల్ మీడియాలో వివరించింది. ‘’ కాలం అలా గడిచిపోతూనే ఉంటుంది… ఇవాళ్ల నేను వెనక్కి తిరిగి చూసుకుంటే… నాకు నా బలం కనిపిస్తుంది. నా బలహీనత కూడా కనిపిస్తుంది. కానీ, అన్నిటికంటే ప్రధానంగా, నాకు నా మనో స్థైర్యం కనిపిస్తుంది. దాని వల్లే నా జీవితాన్ని ‘క్యాన్సర్’ శాసించకుండా అడ్డుకోగలిగాను. నా భవిష్యత్తుని ఆ ప్రాణాంత వ్యాధి నిర్ధేశించకుండా ముందుకు సాగాను ’’ అనే అర్థం వచ్చేలా సోనాలి బెంద్రే తన పోస్ట్ రాసింది.
యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కూడా సోనాలి లాగే క్యాన్సర్ బారిన పడి క్షేమంగా ఆరోగ్యవంతురాలైంది. ఆమె కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ‘క్యాన్సర్ సర్వైవర్స్ డే’ మెసేజ్ షేర్ చేసింది. క్యాన్సర్ కారణంగా సర్జరీలు జరిగితే… ఒంటిపై ఆ గుర్తులు శాశ్వతంగా ఉండిపోతాయి. ‘’క్యాన్సర్ ట్రీట్మెంట్ తాలూకూ గుర్తుల్ని దాచి పెట్టుకోకండి! సగర్వంగా ప్రదర్శించండి! అవి మనల్ని దెబ్బతియటానికి వచ్చిన శత్రువుకి మనం ఎదురుతిరిగి నిలిచిన ఆత్మ విశ్వాసానికి… సంకేతాలు! ‘’ అంటోంది తాహిరా. సోనాలి, తాహిరా లాంటి సెలబ్రిటీస్ తమ అనుభవాలు, భావోద్వేగాలతో సామాన్య జనం ముందుకు రావటం ఖచ్చితంగా ఆహ్వానించదగిన పరిణామం. అలాంటి వారు చెప్పే మాటలు ఎందరికో ఆత్మవిశ్వాసం కలిగిస్తాయనటంలో సందేహం లేదు…