Producer Naga Vamsi: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. దసరా కానుకగా బుధవారం ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన దీనికి ప్రేక్షకుల నుండి చక్కని ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ”మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మా సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది. చిత్ర విడుదలకు ముందు చిరంజీవి గారు పెద్ద మనసుతో మా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నటించిన ‘గాడ్ ఫాదర్’ ఘన విజయాన్ని సాధించింది. దానితో పాటు విడుదలైన మా చిత్రమూ చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నారు. దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, “ఈ సినిమా, ఇందులోని పాత్రలు చాలా సహజంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు అనే దాని మీదే ఈ సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది. మా ఊరు కాకినాడ, పిఠాపురం నుంచి ఫోన్లు చేసి సినిమాలోని పాత్రలు వాళ్ల నిజ జీవితంలో చూసిన పాత్రల్లా సహజంగా ఉన్నాయని చెబుతున్నారు. మొదటి నుంచి ఈ కథని నమ్మి, మా అందరికీ కూడా అదే నమ్మకాన్ని కలిగించిన నిర్మాత నాగ వంశీ గారికి ధన్యవాదాలు. అలాగే గణేష్ కి కూడా ధన్యవాదాలు. నేను కథ చెప్పగానే నచ్చి దానిని ముందుకు తీసుకెళ్ళాడు. మా ఇద్దరికీ ఈ విజయం చాలా కీలకం. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఇద్దరం చాలా సంతోషపడ్డాం” అని అన్నారు.
గణేష్ మాట్లాడుతూ, ” ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మా సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తెర మీద గణేష్ కనిపించలేదు, బాల అనే కుర్రాడు మాత్రమే తెర మీద కనిపించాడు అన్నప్పుడు.. నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నాను అని చిన్న తృప్తి కలిగింది. నా నుంచి నటనను రాబట్టినందుకు, నా దగ్గరకు ఈ కథను తీసుకొచ్చినందుకు లక్ష్మణ్ కి ధన్యవాదాలు. అలాగే ఈ కథను మా కంటే ఎక్కువగా నమ్మి, అన్నీ సమకూర్చి, ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సితార వారికి, నాగ వంశీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను” అని చెప్పారు. వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. “ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది నాగ వంశీ గారికి చిన్న విషయం అయ్యుండొచ్చు. కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విడుదలకు ముందే ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని మేం చెప్పాం. అయితే మేం ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా విజయంలో ప్రతి ఒక్కరిదీ ప్రధాన పాత్రే” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మూవీలో కీలక పాత్రలు పోషించిన దివ్య శ్రీపాద, నటి సురేఖ వాణి కూడా పాల్గొని తమ స్పందన తెలిపారు.